తమిళనాడులో 11మంది తెలుగువాళ్ళు మృతి
posted on: Jul 6, 2014 11:33AM
.jpg)
హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో 24మంది విద్యార్ధులు మరణించినప్పటి నుండి తెలుగువాళ్ళను ఒకదాని తరువాత మరొక విపత్తులు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రాణాలు బలిగొంటూనే ఉన్నాయి. ఆ ప్రమాదం నుండి కోలుకోకముందే తూర్పుగోదావరి జిల్లాలో నగరం గ్రామంలో గ్యాస్ పైప్ లైన్ అగ్ని ప్రమాదంలో 17మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇది జరిగిన కొద్ది రోజులకే తమిళనాడులో 11అంతస్తుల భవనం కూలినపుడు 63మంది మరణించారు. మళ్ళీ ఈ రోజు ఉదయం తమిళనాడులో తిరువళ్ళూరు జిల్లాలో ఉపరవలయం అనే ప్రాంతంలో కూలీలు ఉంటున్న గుడిసెలపై గోడ కూలి ఒక పసిపాపతో సహా 11మంది తెలుగు వాళ్ళు మరణించారు. వారందరూ ఉత్తరాంధ్రాకు చెందినవారు. శిధిలాల క్రింద మరికొంత మంది చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలియగానే సంబంధిత అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని, పొక్లేయిన్ల సహాయంతో శిధిలాలను తొలగిస్తున్నారు. శిదిలాల క్రింద నుండి తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఒక కంపెనీ కోసం 20అడుగుల ఎత్తున్న ప్రహారీ గోడ నిర్మిస్తుంటే, మొన్న కురిసిన వానలకి నాని కూలిపోయినట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు బాధితులకు తగిన సహాయ సహకారాలు అందించేందుకు నెల్లూరు నుండి రాష్ట్రానికి చెందిన ఒక అధికారుల బృందం ఈరోజు ఉదయం తిరువళ్ళూరుకు బయలుదేరింది.



.jpg)
.jpg)

.webp)



