అప్పుడూ ఇప్పుడూ వలంటీర్లు జగన్ ఉద్యోగులే!

వలంటీర్ల వ్యవస్థ ఎందుకు పుట్టుకొచ్చిందో... వారు ఎవరి కోసం పని చేశారో తేలిపోయింది. ఇప్పటి వరకూ వలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అన్నది ఆరోపణల స్థాయిలోనే ఉంది. అయితే జగన్ సర్కార్ పతనమైన నాలుగు నెలల తరువాత ఆ వ్యవస్థ ఎందుకు పని చేసింది? ఎవరి కోసం పని చేసింది అన్న విషయాలను స్వయంగా వైసీపీ అధినేత జగన్ చెప్పేశారు. వలంటీర్లంతా వైసీపీ ఉద్యోగులేననీ, వారికి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదనీ ప్రకటించేశారు. అలా ప్రకటించి ఊరుకోకుండా.. వలంటీర్లందరికీ ఇక నుంచి వైసీపీయే వేతనాలు చెల్లిస్తుందని ప్రకటించేశారు. వరద సాయం కోటి రూపాయలులా ఆయన ప్రకటన మిగిలిపోతుందో? నిజంగానే వారికి ప్రతినెలా ఠంచనుగా జీతాలు ఇస్తారో చూడాల్సిందే కానీ.. జగన్ మానసపుత్రిక వాలంటీర్ వ్యవస్థ ఆవిర్బావ రహసం మాత్రం తేటతెల్లమైపొయింది. ఆ వ్యవస్థను జగన్ తన కొరకు తన చేత తానే ఏర్పాటు చేశారని ఆయనే స్వయంగా అంగీకరించేశారు. 

ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోవడం లేదనీ, అందు చేత వారిని వైసీపీ ఉద్యోగులుగా గుర్తించి నెలనెలా వారికి ఒక్కొక్కరికీ ఐదేవేల చొప్పున  గౌరవ వేతనం చెల్లిస్తాననీ చెప్పారు. వైసీపీ సర్కార్ 2019లో రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తరువాత వాలంటీర్లను నియమించింది. వారందరినీ ప్రభుత్వోద్యోగులుగా ప్రకటించింది. ప్రతి 50 మంది జనాభాకు ఒకరు చొప్పున ఆ వాలంటీర్లను నియమించి ప్రభుత్వ పథకాల అమలు వారి ద్వారా జరిగేలా మార్గదర్శకాలు రూపొందించింది. తద్వారా ప్రభుత్వ యంత్రాంగానికి సమాంతరంగా వాలంటీర్ల వ్యవస్థ తయారైంది. జనం అధికారులపై కాకుండా వాలంటీర్లపై ఆధారపడేలా పరిస్థితుల ఏర్పడేలా చేసింది. అంతే కాకుండా వారికే ఎన్నికల విధులు అప్పగించి ఎన్నికలలో లబ్ధి పొందాలని జగన్ భావించారు. అయితే వాలంటీర్లను ఎన్నికల విధులకు వినియోగించడాన్ని ఈసీ అంగీకరించకపోవడంతో జగన్ వ్యూహం దెబ్బతింది. దీంతో వాలంటీర్లు రాజీనామా చేసి  పార్టీ కోసం పని చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఎన్నికలలో గెలిచి మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందనీ, అప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లనందరినీ తిరిగి నియమిస్తాననీ అప్పట్లో జగన్ పేర్కొన్నారు.

జగన్ పిలుపును నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. అయితే అలా చేయని వారు లక్షన్నర మందికి పైగా ఉంటారు. ఇప్పుడు వారి విషయంలోనే జగన్ ఈ ప్రకటన చేశారు.  వాలంటీర్లంతా వైసీపీ ఉద్యోగులేనని ప్రకటించారు. గతంలో వారు వైసీపీ కోసం పని చేశారనీ, ఇప్పుడు కూడా అదే చేయాలనీ, వైసీపీయే వారికి నెల నెలా వేతనం చెల్లిస్తుందనీ అన్నారు. తద్వారా వాలంటీర్ వ్యవస్థ ఎవరి కోసం ఎందుకు ఏర్పాటయ్యిందో శషబిషలకు తావు లేకుండా చెప్పేశారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu