శశికళపై మళ్లీ ఐటీ అస్త్రం.. 187 చోట్ల దాడులు

జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలు ఎలా మారిపోయాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఈ రాష్ట్రంలో బలపడాలని చూస్తోన్న బీజేపీ అందుకు సామ, దాన, బేధ, దండోపాయాలను ఉపయోగిస్తోంది. ఒప్పించడమో.. బెదిరించడమో ఎలాగైనా సరే అంతిమంగా తన దారికి తెచ్చుకుంటోంది. సరిగ్గా అన్ని తాను అనుకుంటున్నట్లు జరుగుతున్నాయి అనుకుంటున్న వేళ శశికళ కాస్త అతి చేసినట్లు కనిపించడంతో అక్రమాస్తుల కేసును తిరగదోడి ఆమెను సైడ్ చేశారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

 

తాను జైలుకు వెళ్లినా మేనల్లుడి ద్వారా పార్టీని, ప్రభుత్వాన్ని చెప్పుచేతల్లోకి తీసుకోవాలని భావించింది చిన్నమ్మ. అయితే ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరపడం, ఆర్కే నగర్ ఉపఎన్నికలో గెలుపొందడానికి వీలుగా ప్రజలను ప్రలోభపెట్టాలని ప్రయత్నించినట్లు దినకరన్ ప్రయత్నించినట్లు తేలడంతో ఐటీ దాడులతో కేంద్రప్రభుత్వం అణచివేసిందని చెన్నై టాక్.

 

ఇదంతా సద్దుమణిగి ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో మరోసారి తమిళనాట ఐటీ దాడులు జరడగం సంచలనం సృష్టిస్తోంది. అన్నాడీఎంకే అధికారిక మీడియా సంస్థ జయ టీవీ కార్యాలయంతో పాటు.. శశికళ బంధువుల ఇళ్లపై ఇవాళ ఉదయం నుంచి దాడులు జరుగుతున్నాయి. తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లలోని మొత్తం 187 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. పన్న ఎగవేత ఆరోపణలతో పాటు.. డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం రావడంతో ఐటీ శాఖ దాడులకు దిగిందని చెబుతున్నారు.