Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదం..8 మంది కార్మికులు మృతి
posted on: Jun 8, 2026 6:32PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్‌ప్లాంట్ (ఉక్కు కర్మాగారం)లో సోమవారం ఘోర ప్రమాదం సంభవించింది. ప్లాంట్ అంతర్గత విభాగంలో ఒక్కసారిగా ఉక్కుద్రవం లీక్ కావడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఆయన ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించి, సహాయక చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.ప్రమాద తీవ్రత, ప్రస్తుత పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్లాంట్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం సమయంలో స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్-2 (Steel Melting Shop-2), ఎస్‌టీసీ-3 హీట్ ఎఫ్‌జీ విభాగంలో కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ ఎత్తున ఉన్న కరిగిన ఉక్కుద్రవాన్ని (లిక్విడ్ స్టీల్) పైకి లిఫ్ట్ చేసే ప్రక్రియను చేపట్టారు. దురదృష్టవశాత్తూ ఆ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఉక్కుద్రవం ఒక్కసారిగా బయటకు లీకైంది.
తీవ్రమైన వేడితో ఉండే ఉక్కుద్రవం చుట్టుపక్కల ప్రాంతాలకు వేగంగా వ్యాపించడంతో ఆ విభాగంలో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తమయ్యే లోపే మంటలు చుట్టుముట్టాయి. తీవ్రమైన వేడి, దట్టమైన పొగ కారణంగా కార్మికులు ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీసినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఉడుకు ద్రవం పడటంతో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే కాలిబూడిదయ్యారు.
మరికొందరు కార్మికులు తీవ్ర గాయాలపాలవడంతో వారిని తోటి సిబ్బంది వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్టీల్‌ప్లాంట్ భద్రతా విభాగానికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది పలు ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకుని, ఎగసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఈ దారుణ ఉదంతంపై కార్మిక సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు పునరావృతమవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. గతంలోనూ స్టీల్‌ప్లాంట్‌లో పలుమార్లు సాంకేతిక లోపాలు, లీకేజీలు జరిగాయని, నాణ్యమైన నిర్వహణ లోపించడం వల్లే కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని మండిపడుతున్నారు. మృతుల కుటుంబాలకు భారీ పరిహారం అందించాలని, ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణకు ఆదేశించారు. ఉక్కుద్రవాన్ని లిఫ్ట్ చేసే క్రమంలో ఎలాంటి క్రేన్ లేదా యంత్రాల లోపం జరిగిందనే కోణంలో నిపుణుల కమిటీ దర్యాప్తు చేయనుంది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. పరిశ్రమలలో కార్మికుల రక్షణకు కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు మరియు కార్మిక వర్గాలు కోరుతున్నాయి.



.webp)


