వివేకా హత్య కేసులో కీలక పరిణామం...ఆ ఇద్దరిపై కేసు
posted on Nov 8, 2025 3:15PM

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాజుపాలెం పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. వివేకా హత్య వ్యవహారంలో గతంలో వీరు తప్పుడు కేసులు నమోదు చేశారు.
పులివెందులకు చెందిన కుళాయప్ప అనే వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. .వివేకా హత్య కేసులో సునీత, రాజశేఖర్ రెడ్డి దంపతులు, అప్పటి విచారణాధికారి రామ్ సింగ్ లపై తప్పుడు కేసు నమోదు చేయడానికి ఈ ఇద్దరు పోలీస్ అధికారులు కారకులు. అప్పట్లో సునీత రాజశేఖర్ రెడ్డి దంపతులు, విచారణాధికారి రామ్ సింగ్‌లు తమను వేధిస్తున్నారని వివేకా పీఎ కృష్ణా రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో ముగ్గురిపైనా తప్పుడు కేసు నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే తాజాగా చర్యలకు ఉపక్రమించారు.