తిరుమలలో అపచారం.. కొండపైకి నిషేధిత ఆహారంతో వచ్చిన భక్తులు

కోట్లాది మంది భక్తులు భక్తితో కొలిచే దైవం తిరుమల  వేంకటేశ్వర స్వామి. ఆ స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూల నుంచీ  పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అత్యంత పవిత్రమైన తిరుమలలో ఇటీవల తరచుగా కొన్ని అపచారాలు చోటు చేసుకుంటున్నాయి.   తిరుమల కొండపై  నియమాలు, కట్టుబాట్లు, నిబంధనల మేరకు  మాంసం, మద్యం, మత్తు పదార్థాలను తిరుమల కొండపై నిషేధం.  అయితే జగన్ హయాంలో వీటన్నిటికీ తిలోదకాలిచ్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆగమశాస్త్ర విరుద్ధంగా తిరుమల కొండ పవిత్రతను మంటగలిపేలా జగన్ హయాంలో పలు కార్యక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి.

తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమలలో అపచారాలకు అవకాశం లేకుండా పోయిందని అంతా భావించారు.  కానీ తాజాగా తిరుమల కొండపై మరో అపచారం చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన 28 మంది భక్త బృందం శుక్రవారం (జనవరి 17) తిరుమల కొండకు వచ్చింది. అలిపిరి ఘాట్ మార్గం గుండా వీరంతా కొండపైకి చేరుకున్నారు. వారు తెలిసో తెలియకో తమ వెంట కోడిగుడ్ల కూడ,  పలావ్ తెచ్చుకున్నారు. అలిపిరి వద్ద భద్రతా వైఫల్యాం కారణంగానే వారు తిరు మలపైకి ఆ పదార్ధాలతో చేరుగలిగారనడంలో సందేహం లేదు. ఓ పెద్ద గిన్నెలో కోడిగుడ్ల కూర, పలావ్ తో వచ్చిన వారు కొండపై రాంబగీచ గెస్ట్ హౌస్ సమీపంలోని బస్టాండ్ పార్కింగ్ స్థలంలో వాటిని తింటూ కనిపించారు.  ఇది గమనించిన మిగిలిన భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వారిని అదుపులోనికి తీసుున్నారు. తిరుమల నిబంధనల గురించి తమకు తెలియదని చెప్పారు.  

ఈ సంఘటనతో టీటీడీలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది.  అలాగే కోడిగుడ్ల కూరతో కొండపైకి వచ్చిన వారంతా అన్యమతస్థులు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.  టీటీడీలో భద్రతా వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.