Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సెలూన్ నడిపే వ్యక్తికి రూ. 72 లక్షల జీఎస్టీ నోటీసు!
posted on: Apr 8, 2026 3:56PM

చిన్నపాటి సెలూన్ నడుపుకుంటూ జీవనం సాగించే ఒక సామాన్యుడికి జీఎస్టీ అధికారులు కళ్లు బైర్లు కమ్మే షాక్ ఇచ్చారు. ఏకంగా రూ. 72 లక్షల పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. విజయవాడ పంజా సెంటర్ ప్రాంతంలో సుమారు 40 ఏళ్లుగా సెలూన్ షాపు నడుపుకుంటున్న పైడాడ శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఈ చేదు అనుభవం ఎదురైంది. తన జీవితంలో ఎన్నడూ చూడని అంకెను నోటీసులో చూడటంతో ఆయన ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు.
అసలు విషయం ఏమిటంటే, శ్రీనివాసరావు పేరు మీద విశాఖపట్నంలో భారీ ఎత్తున 'స్క్రాప్ ఐరన్' (ఇనుప వ్యర్థాల) వ్యాపారం జరిగినట్లు జీఎస్టీ రికార్డులు చెబుతున్నాయి. ఈ వ్యాపార లావాదేవీలకు సంబంధించి పన్ను చెల్లించలేదన్న నెపంతో అధికారులు ఆయన బ్యాంక్ ఖాతాను నిలిపివేశారు. పథకాల డబ్బులు రాకపోవడం, బ్యాంకు లావాదేవీలు ఆగిపోవడంతో ఆందోళన చెందిన బాధితుడు బ్యాంకుకు వెళ్లగా.. జీఎస్టీ అధికారుల ఆదేశాల మేరకే ఖాతాను హోల్డ్ చేసినట్లు సిబ్బంది స్పష్టం చేశారు.
ఈ పరిణామంతో ఖంగుతిన్న శ్రీనివాసరావు వెంటనే అధికారులను సంప్రదించారు. తాను దశాబ్దాలుగా కత్తెర, దువ్వెన పట్టుకుని సెలూన్ నడుపుకుంటున్నానని, తనకు ఇనుప వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేదని మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ, రికార్డుల్లో పేరు ఉండటంతో విశాఖపట్నం వెళ్లి అక్కడి అధికారులను కలవాలని స్థానిక యంత్రాంగం సూచించింది. కేటుగాళ్లు ఎవరైనా తన ఆధార్, పాన్ కార్డు వివరాలను తస్కరించి, తన ప్రమేయం లేకుండానే దొంగ వ్యాపారాలు సృష్టించి ఉంటారని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.
ఈ దెబ్బతో శ్రీనివాసరావుకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోయాయి. అప్పుల బాధలు, రోజువారీ ఖర్చులకే ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇలాంటి నోటీసు రావడం ఆయన కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. సైబర్ నేరగాళ్ల మాయాజాలం వల్ల అమాయకులు ఎలా బలి అవుతున్నారో ఈ ఘటన అద్దం పడుతోంది.
ప్రస్తుతం న్యాయం కోసం శ్రీనివాసరావు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, తనని ఈ చిక్కుల నుంచి గట్టెక్కించాలని వేడుకుంటున్నారు. వ్యక్తిగత డేటా దుర్వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, తనలాంటి సామాన్యులను వేధింపుల నుంచి కాపాడాలని ఆయన కోరుతున్నారు. ఈ కేసులో తదుపరి విచారణలో ఏ నిజాలు బయటపడతాయో వేచి చూడాలి.



.webp)


