విజయవాడలో ఔటర్ రింగ్‌రోడ్ పనులు త్వరలో ప్రారంభం...
posted on: Sep 24, 2014 5:36PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు దేశమంతా విజయవాడ వైపు ఆసక్తిగా చూస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాజధానిగా విజయవాడ పరిసరాలు సాధించే అద్భుతమైన ప్రగతిని దేశమంతా ఊహిస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడ నగరానికి కంఠహారంలా నిలిచే ఒక అద్భుతమైన ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కాబోతోంది. ఆ ప్రాజెక్టు మరేదో కాదు... విజయవాడ ఔటర్ రింగ్‌రోడ్. అయితే ‘విజయవాడ ఔటర్ రింగ్‌రోడ్’ అంటే తాజాగా ప్రభుత్వం సంకల్పించిన విజయవాడ, గుంటూరు తెనాలి, మంగళగిరి (వీజీటీఎం)లను కలిపే రింగ్‌రోడ్ అనుకునే అవకాశం వుంది. కానీ ఈ ఔటర్ రింగ్‌రోడ్ అది కాదు. ఇది ఎప్పటి నుంచో ప్రతిపాదనలో వుండి, కాంట్రాక్ట్ ఒప్పందాలు కూడా పూర్తయిన విజయవాడ బైపాస్ ఔటర్ రింగ్ రోడ్. వీజీటీఎం పరిధిలో నిర్మించే భారీ ఔటర్ రింగ్ రోడ్డు కంటే నిర్మాణం పూర్తి చేసుకునే ప్రాజెక్టు.
ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల విజయవాడ నగరం మీద ట్రాఫిక్ ఒత్తిడి బాగా తగ్గే అవకాశం వుంది. ఈ రోడ్డు నిర్మాణానికి 2009 సంవత్సరంలోనే ప్రభుత్వ వర్గాలు శ్రీకారం చుట్టాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ రోడ్డును నిర్మిస్తారు. నేషనల్ హైవే నంబర్ 5 మీద వున్న మంగళగిరి నుంచి నేషనల్ హైవే నంబర్ 9 మీద వున్న గొల్లపల్లి వరకు నున్న, ముస్తాబాద్ మీదుగా గన్నవరం సమీపంలోని పెద్ద అవుటపల్లి మీదుగా వెళ్ళే ఈ రోడ్డు పశ్చిమ గోదావరి జిల్లాలోని గుండుగొలను వరకు వుంటుంది. ఈరోడ్డు నిర్మాణం పూర్తయితే విజయవాడ నగరం మీద ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడం మాత్రమే కాకుండా. ఈ బైపాస్ రోడ్డు ఉన్నంత మేర అద్భుతమైన అభివృద్ధి జరిగే అవకాశం వుంది. ఈ ప్రాజెక్టుకు 1,664 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. గామన్ ఇండియా సంస్థ కాంట్రాక్టును కూడా దక్కించుకుంది. పదిహేను రోజుల్లో ఈ రోడ్డుకు సంబంధించిన పనులు మొదలయ్యే అవకాశం వుందని తెలుస్తోంది.



.jpg)


.webp)



