విజయసాయి పొలిటికల్ రీఎంట్రీ.. వైసీపీలోకి హోం కమింగేనా?

posted on: Aug 11, 2026 4:32PM

రాజకీయ సన్యాసం ప్రకటించి.. వ్యవసాయమే తన వ్యాపకమన్న విజయసాయి యూటర్న్ తీసుకున్నారు. అన్యాపదేశంగా కాదు నేరుగానే తన రాజకీయ రీఎంట్రీ గురించిన సంకేతాలు, ప్రకటనలు గుప్పిస్తున్నారు. కొత్త రాజకీయ పార్టీ అంటూ లీకులిస్తున్నా విజయసాయి అడుగులు మాత్రం జగన్ పంచన చేరే దిశగానే పడుతున్నాయి. ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు.

అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో దారి అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ఆయన మారుస్తున్న మాటలు, రంగులు వింటే.. చూస్తే.. ఊసరవిల్లి కూడా సిగ్గుపడేలా ఉన్నాయి.  

తాజాగా విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా  తన పొలిటికల్ రీఎంట్రీ విషయాన్ని దాదాపు కన్ ఫర్మ్ చేసేశారు. తన రాజకీయ రీ-ఎంట్రీ,  భవిష్యత్ కార్యాచరణ, సొంత పార్టీయా కాదా అన్న విష యాలన్నీ త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇస్తానంటూ ప్రకటించి సస్పెన్స్ క్రియోట్ చేశారు. అయితే పరిశీలకులు మాత్రం ఆయన సోషల్ మీడియా పోస్టును ప్రస్తావిస్తూ.. సస్పెన్సేమీ లేదు.. విజయసాయి చేరేది జగన్ గూటికే అని విశ్లేషణలు చేస్తున్నారు. వారు తమ విశ్లేషణలకు  ఇటీవలి విజయసాయి వ్యాఖ్యలు, విమర్శలను ఉదాహరణలుగా చూపుతున్నారు.  

విజయసాయి ఇటీవలి ట్వీట్ లో ఏపీలో శాంతి భద్రతల సమస్య, బాలికలు, మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అక్కడితో ఆగకుండా పనిలో పని అన్నట్లు వైసీపీనీ దుయ్యబట్టారు. సమస్యలపై, శాంతి భద్రతల అంశంపై, మహిళలూ బాలికల భద్రతపై వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఘోరంగా విఫలమైందంటూ చెరిగేశారు. 

ప్రత్యేకంగా ఆయన విమర్శలన్నీ వైసీపీలో కొంందరిని టార్గెట్ చేశాయి. అందులో దాపరికం ఏమీ లేదు. ఆయన విస్పష్టంగా కొందరు వైసీపీ నేతలు అధికార తెలుగుదేశం కూటమితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా, పార్టీ పరంగా ఆందోళనలు జరగకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. సాధారణంగా శాంతి భద్రతలు, మహిళల భద్రత వంటి అంశాలపై ఎవరైనా ప్రభుత్వాన్నీ, పోలీసుల పని తీరునూ నిలదీస్తుంటారు. కానీ విజయసాయి మాత్రం వైసీపీని టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పించారు.

అందులోనూ కొందరు నేతలు అంటూ ఆయన విస్పష్టంగా చేసిన విమర్శలు.. గతంలో తాను వైసీపీలో ఉండగా తనకు అడుగడుగునా అవరోధంగా నిలిచి.. చివరకు తాను పార్టీ వీడటానికి కారణమైన సజ్జల బ్యాచ్ పై పరోక్షంగా ఎక్కుపెట్టిన అస్త్రాలేనని పరిశీలకులు అంటున్నారు.  ఇక్కడ ఇటీవల సజ్జల టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూ ఏకంగా తాడేపల్లి వైసీపీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేసిన బోరుగడ్డ అనీల్ విషయాన్ని అనివార్యంగా ప్రస్తావించాలి. ఎందుకంటే.. వైసీపీలో సజ్జల వ్యతిరేకులందరూ ఇప్పుడు ఏక కాలంలో బయటకు వచ్చి విమర్శలకు దిగుతున్నారంటే.. విజయసాయి వైసీపీ రీఎంట్రీకి సజ్జల అడ్డంకి తొలగిపోయేలా పార్టీ అధినేత జగన్ మనసు మార్చడానికేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Vijayasai Reddy political re Entry,  YCP  News, YS Jagan, AP Politics, TeluguOne News

google-ad-img
    Related Sigment News
    • Loading...