ప్రభుత్వమే మాల్యాని దేశం దాటించింది- కాంగ్రెస్‌

posted on: Mar 10, 2016 2:58PM

 

వేలకోట్ల రుణాలను ఎగ్గొట్టి పత్తాలేకుండా పోయిన విజయ్‌మాల్యా కోసం ఇప్పుడు కొట్లాట మొదలైంది. ‘విజయ్ మాల్యాకు రుణాలు ఇచ్చింది మీ ప్రభుత్వ హయాంలోనే’ అని బీజేపీ అంటే, ‘ఇస్తే ఇచ్చాం, ఇప్పుడెందుకు ఆయనను పారిపోనిచ్చారు’ అంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. ఇవాళ రాజ్యసభలో జరిగిన వాడివేడి చర్చలో... ప్రభుత్వ సహకారం ఉండటం వల్లే విజయ్‌మాల్యా దేశం దాటిపోయాడంటూ, కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్ విరుచుకుపడ్డారు. కనపడకుండా పోవడానికి మాల్యా ఏమీ సూది కాదనీ, లుక్‌ఔట్‌ నోటీసుల ఉండగానే అతను దేశం దాటి పోవడం ఎలా సాధ్యమనీ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాల్యా ఏదో ఒక రోజున ఎగిరిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిసి కూడా ప్రభుత్వ సంస్థలు అతణ్ని ఎందుకు అరెస్టు చేయలేదని మండిపడ్డారు.

మాల్యా దేశం వదిలి పారిపోయిన కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక దోషిగా ఎంచి సుప్రీంకోర్టు విచారించాలని డిమాండ్ చేశారు. గులాంనబీ ఆజాద్‌ ఆరోపణలకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కూడా దీటుగా స్పందించారు. విజయ్ మాల్యా విషయంలోని ఆర్థిక అవకతవకలన్నీ కాంగ్రెస్‌ హయాంలోనే జరిగాయనీ, తాము ఆయన నుంచి చివరి పైసా వరకూ రాబడతామని పేర్కొన్నారు. అరుణ్‌జైట్లీ చెప్పిన లెక్కల ప్రకారం విజయ్‌మాల్యాగారు బ్యాంకులను ఎగ్గొట్టిన రుణాల మొత్తం అక్షరాలా 9,091.4 కోట్లు!

google-ad-img
    Related Sigment News
    • Loading...