Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...'మసూద' భయపెడుతుంది అంటున్న రౌడీ హీరో!
posted on: Nov 14, 2022 3:26PM

"ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాకు నా పూర్తి మద్దతు ఉంటుంది" అంటూ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల 'మసూద' ట్రైలర్ విడుదల సమయంలో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడీ సినిమా టీమ్‌కు తన సపోర్ట్ అందించాడు. మూవీ టీమ్‌ని కలిసి వారితో కాసేపు సరదాగా ముచ్చటించి.. సినిమా విశేషాలను అడిగి తెలుసుకుని.. 'మసూద' సినిమాపై తనకున్న ప్రేమను తెలియజేశాడు.
'మళ్లీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన మూడో చిత్రం 'మసూద'. హారర్-డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న విడుదల కాబోతోంది. "అప్పుడే భయపడాల్సిన అవసరం లేదు.. అసలు భయం ముందుంది" అంటూ తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సూపర్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది.
'మసూద' ట్రైలర్ ను విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపిన విజయ్ ని తాజాగా మూవీ టీమ్ కలిసింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ.. "టీమ్‌లో చాలా మంది నాకు తెలుసు. చిత్ర హీరో తిరు.. నా ఫస్ట్ సినిమా అప్పటి నుంచి తెలుసు. నాతో పాటు అతను కూడా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. నగేష్ నా 'పెళ్లిచూపులు' సినిమా కెమెరామ్యాన్. 'అర్జున్ రెడ్డి' సినిమా ఓ షెడ్యూల్ అతను చేశాడు. నా ఉన్నతికి ఆయన కూడా ఓ ప్రధాన కారణం. అతనంటే నాకెంతో ఇష్టం. రాహుల్ 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాని మా నవీన్‌తో ప్రొడ్యూస్ చేశాడు. ఇప్పుడు మళ్లీ కొత్త బంచ్‌తో ఈ సినిమా చేస్తున్నారు. సాయికిరణ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం అంటే నాకెంతో ఇష్టం. నవంబర్ 18న 'మసూద' సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. భయపెడుతుంది కూడా. ఈ మూవీ ట్రైలర్ నాకెంతో నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అందుకే నా ప్రేమ, అభినందనలు ఈ టీమ్‌కి ఇలా తెలియజేస్తున్నాను. అందరూ థియేటర్లలో ఈ సినిమాని చూడండి. ఈ సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు.
చాలా కాలం తరువాత తెలుగులో పూర్తి హారర్ డ్రామాగా ఈ సినిమా వస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ఎస్‌విసి బ్యానర్ ద్వారా విడుదల చేస్తుండటం విశేషం. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రశాంత్ ఆర్.విహారి, సినిమాటోగ్రాఫర్ గా నగేష్ బానెల్, ఎడిటర్ గా జెస్విన్ ప్రభు వ్యవహరిస్తున్నారు.






