ద్రవిడ కోటపై విజయ కేతనం!

posted on: May 7, 2026 5:45PM

తమిళనాడు రాజకీయ చరిత్రలో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక  నిలిచిపోయాయి.  ఆరు దశాబ్దాలుగా రాష్ట్ర పాలనా పగ్గాలను మార్చి మార్చి పంచుకుంటున్న డీఎంకే , ఏఐఏడీఎంకే పార్టీల గుత్తాధిపత్యానికి ఈ ఎన్నికలు గండికొట్టాయి. వెండితెరపై దళపతిగా ముద్ర వేసుకున్న  విజయ్, తన రాజకీయ పార్టీ  తమిళగ వెట్రి కళగం టీవీకే ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. తొలి ప్రయత్నంలోనే రాష్ట్రంలో అతిపెద్ద శక్తిగా ఎదిగారు. సంప్రదాయ రాజకీయ సమీకరణాలను తల్లకిందులు చేస్తూ..  టీవీకే సాధించిన ఈ విజయం, తమిళనాట ఒక సరికొత్త రాజకీయ ప్రయోగానికి తెరలేపింది.

 మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. స్వల్ప తేడాతో మ్యాజిక్ ఫిగర్‌కు దూరమైనప్పటికీ.. అసెంబ్లీలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించడం ద్వారా విజయ్ తన సత్తా చాటారు. ద్రవిడ సిద్ధాంతాలకు ప్రత్యామ్నాయంగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నప్పటికీ..  క్షేత్రస్థాయిలో టీవీకే సిద్ధాంతాలు డీఎంకే భావజాలానికి దగ్గరగా ఉన్నాయనే చర్చ  సాగుతోంది.

ముఖ్యంగా సామాజిక న్యాయం, సమానత్వం,  ద్విభాషా విధానం వంటి అంశాలను విజయ్ బలంగా వినిపించడం ఓటర్లను ఆకట్టుకుంది.  అయితే..  టీవీకే చుట్టూ కొన్ని కీలక సందేహాలు కూడా నెలకొన్నాయి. ఈ పార్టీని డీఎంకేకు  సాఫ్ట్ వెర్షన్ గా కొందరు అభివర్ణిస్తున్నారు. సనాతన ధర్మం, హిందూ ఆచారాలు,  మతపరమైన అంశాలపై విజయ్ భవిష్యత్తులో ఎలాంటి వైఖరి అవలంబిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే..  టీవీకే వెనుక క్రైస్తవ సంస్థలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల నెట్‌వర్క్ ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. 

డీఎంకే హయాంలో కొనసాగిన అదే తరహా మత, సామాజిక రాజకీయాలే టీవీకేలోనూ పునరావృత మవుతాయా? నిజమైన మార్పు వస్తుందా? అన్న ప్రశ్నలు వినవస్తున్నాయి.  మరోవైపు.. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ   ఆశించిన ఫలితాలను సాధించలేకపోవడం వెనుక  కూడా పెద్ద చర్చ జరుగుతోంది. గత కొన్నేళ్లుగా అన్నమలై రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేస్తూ.. డీఎంకే ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ ప్రజల్లో బలమైన వ్యతిరేక భావజాలాన్ని నిర్మించారు. కానీ..  ఎన్నికల సమయంలో ఆయన ప్రాధాన్యతను తగ్గించడం సహా వ్యూహాత్మక లోపాల వల్ల బీజేపీ నష్టపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 అన్నమలై గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే..  విజయ్ ఫలితం అందుకున్నారన్న వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.  బీజేపీ భవిష్యత్తులో ఏఐఏడీఎంకేతో కలిసి వెళ్తుందా లేక ఒంటరి పోరుకు మొగ్గు చూపుతుందా అన్న విషయంపై ఇప్పుడు ఆ పార్టీలో  అంతర్గతంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.   ఇక జాతీయ స్థాయిలో చూస్తే..  తమిళనాడు ఫలితాలు దక్షిణ భారత రాజకీయాలపై   ప్రభావం చూపే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్  వంటి రాష్ట్రాల్లో ఎన్డీయే  బలం పుంజుకోవడం..  కేరళలో యూడీఎఫ్ పునరాగమనం వంటి పరిణామాల మధ్య 2029 సార్వత్రిక ఎన్నికలకు ఈ ఫలితాలు దిశానిర్దేశం చేయనున్నాయి.

ద్రవిడ రాజకీయాల భవిష్యత్తు,   నాన్-ద్రవిడన్ శక్తుల స్థిరత్వంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.  గడచిన ఆరు దశాబ్దాల ద్రావిడ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందనీ.. పరిపాలనలో పారదర్శకత లోపించిందనే విమర్శలు బలంగా ఉన్నాయి. కేంద్ర నిధుల వినియోగంపై కఠినమైన ఆడిటింగ్ అవసరమనీ.. పెట్టుబడుల విషయంలో కార్పొరేట్ రంగం ఆచితూచి వ్యవహరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. పాలనలో లోపాలు తలెత్తితే అది నేరుగా సామాజిక శాంతి,  ఉపాధిపై ప్రభావం చూపుతుందని హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి.  విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఇది కేవలం పాత ద్రవిడ రాజకీయాల రీబ్రాండింగ్‌గా మిగిలిపోతుందా? లేక నిజమైన పాలనా సంస్కరణలకు శ్రీకారం చుడుతుందా అనేది చూడాలి.  మత స్వేచ్ఛ, విద్యా-ఆరోగ్య రంగాల్లో మత సంస్థల పాత్ర వంటి సున్నితమైన అంశాలపై టీవీకే ఎలా వ్యవహరిస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.    

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ నచ్చినట్లైతే https://www.teluguone.comను లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...