దేశ సమైక్యత సంస్కృతి విలువలను కాపాడాలి : వెంకయ్యనాయుడు
posted on Nov 1, 2025 5:48PM

దేశ సమైక్యతను సంస్కృతిని విలువలను కాపాడడంలో యువత కీలక పాత్ర పోషించాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం యోగి వేమన విశ్వవిద్యాలయంలోని నూతన పరిపాలనా భవనంలోని అన్నమయ్య సెనేట్ హాలులో ఏర్పాటు చేసిన శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి ఉత్సవ వేడుక సభలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులకు భారత ఔన్నత్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గొప్పదనం, తెలుగు భాష తీయదనం, కడప జిల్లా కళా సాహిత్య విశిష్టతను విద్యార్థులకు విరించారు. అనంతరం యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి మనోభావాలను అందిపుచ్చుకుని విలువైన సందేశాన్నిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దేశ సమైఖ్యతకు, దేశ అభివృద్ధికి, దేశ విలువలను కాపాడడంలో నేటి యువత కీలక పాత్ర పోషించాలని విద్యార్థులకు సూచనలు చేశారు.
సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించాలని, విద్యా వికాసంతో పాటు యోగా, క్రీడలు, కళలు, సాహిత్యం, మానసిక వికాసంపై దృష్టి సారించాలని సూచించారు.మన కట్టుబొట్టు, మన సంస్కృతి సంప్రదాయాలు, మన వేశాభాషలు, మన యాస ను కాపాడుకోవడం ముఖ్యం అని అన్నారు. అందం, చందం, హుందాతనం అన్నీ అవసరమే.. వాటితో పాటు మాటతీరు, మర్యాద మనన్నలు, పెద్దలంటే గౌరవం, ఆరోగ్యకరమైన భారతీయ ఆహారపు అలవాట్లను అవలంభించాలని విద్యార్థులకు సూచించారు.
కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయాలి, ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని కేటాయించాలి. ప్రేమనుబంధాలను బలపరుచుకోవాలి, అనురాగంపెంపొందించాలిని హితబోధ చేశారు.
సమాజంలో స్నేహ భావాన్ని పెంపొందించాలి. ఈర్ష్య ద్వేషాలను పక్కన పెట్టి.. ఆప్యాయత, అనురాగాలను పెంపొందించాలని బోధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా.కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, వైసీయూ వీసీ బెల్లంకొండ రాజశేఖర్, రిజిస్ట్రార్ పద్మ, యూనివర్సిటీ ఆచార్యులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.