వెంకయ్య చెప్పిన వేదం!

posted on: Jan 30, 2014 2:36PM

 

 

 

రాష్ట్ర విభజన విషయంలో భారతీయ జనతాపార్టీ మనసు మారుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పిన మాటలు మొన్నటి వరకూ నమ్ముతూ వచ్చిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు ఈ విషయంలో అసలు వాస్తవాలను తెలుసుకుంది. అందుకే బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి గానీ, కిషన్ రెడ్డి నుంచి గానీ తెలంగాణ విషయంలో ఏకపక్ష ప్రకటనలు రావడం లేదు. తెలంగాణ రావాల్సిందే.. కానీ సీమాంధ్రుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని ఇప్పుడు బీజేపీ కొత్త పల్లవి పాడుతోంది.

 

తెలంగాణ విషయంలో పేనుకు పెత్తనం ఇచ్చినట్టు కిషన్‌రెడ్డికే మొత్తం అధికారం ఇవ్వడంతో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి బోడిగుండులా అయిపోయింది. దాంతో ఇంతకాలం మౌనం వహించిన బీజేపీ అగ్ర నాయకుడు వెంకయ్య నాయుడు రంగంలోకి దిగారు. తెలంగాణ విషయంలో బీజేపీ చేసిన పొరపాట్లను సరిదిద్దే పనిలో ఆయన ప్రస్తుతం వున్నారు. కేంద్రం పంపిన తెలంగాణ బిల్లు తప్పుల తడకలా వుందని, ఈ బిల్లు ఇటు తెలంగాణ వారికి గానీ, అటు సీమాంధ్ర ప్రజలకు గానీ ఆమోదయోగ్యంగా లేదని వెంకయ్య నాయుడు చెబుతూనే వున్నారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు ఇస్తుందేమోనన్న భయం మొన్నటి వరకూ సీమాంధ్ర ప్రజల్లో వుండేది. అయితే వెంకయ్య నాయుడు రంగప్రవేశం చేసిన తర్వాత ఆ భయం తగ్గింది.



బుధవారం నాడు విజయవాడలో వెంకయ్య ఏర్పాటు చేసిన బహిరంగసభ సీమాంధ్రులలో ధైర్యాన్ని కలిగించింది. రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత సులభం కాదన్న విషయం కూడా స్పష్టమైంది. వెంకయ్య నాయుడు వేదం లాంటి ఒక మాట అన్నారు. ‘‘ఎక్కడో ఇటలీలో పుట్టిన సోనియాగాంధీ భారతదేశాన్ని ఏలుతోంది. విజయవాడలో పుట్టినవాడు హైదరాబాద్‌లో వుండకూడదా?’’ అని వెంకయ్య అన్న మాట సీమాంధ్రులలో ధైర్యాన్ని ఎంతగానో పెంచింది. కాంగ్రెస్ పార్టీ చేయాలని తలపెట్టిన అడ్డగోలు విభజనకు భారతీయ జనతాపార్టీ ఒప్పకోదన్న నమ్మకం ఇప్పుడు సీమాంధ్రులలో మరింత బలపడుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ని, తెలుగువారిని కాంగ్రెస్ పార్టీ నుంచి కాపాడగలిగే కీలక వ్యక్తుల్లో వెంకయ్య నాయుడు కూడా ఒకరు.

google-ad-img
    Related Sigment News
    • Loading...