మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ క్షమాపణకు మంత్రి వంగలపూడి అనిత డిమాండ్

posted on: Jun 17, 2026 3:32PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో   తీవ్ర దుమారం రేగింది. ఏపీ హోంమంత్రి  వంగలపూడి అనితను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి.  రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా.. ఒక మహిళా మంత్రి వ్యక్తిత్వాన్ని, కట్టుబొట్టును టార్గెట్ చేస్తూ చేసిన గుడివాడ అమర్నాథ్  చేసిన ఈ వ్యాఖ్యలపై కూటమి నేతలతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు,  తెలుగు మహిళా విభాగాలు తీవ్రస్థాయిలో మండి పడుతున్నాయి. మాజీ మంత్రి క్షమాపణను డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగుతున్నాయి. 

ఈ వివాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత  మాట్లాడుతూ,   రాజకీయ ముసుగు వేసుకుని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే వికృత ధోరణిని తాము  సహించబోమని స్పష్టం చేశారు.  ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసే ముందు, తమ ఇళ్లలో కూడా మహిళలు, తల్లులు, చెల్లెళ్లు ఉన్నారనే కనీస విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. సమాజంలో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు   గుడివాడ అమర్‌నాథ్  బహిరంగ క్షమాపణ చెప్పాలని  డిమాండ్ చేశారు.

ఈ రాజకీయ వ్యవహారంపై జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా  తీవ్రంగా స్పందించారు. ఇవి కేవలం ఒక హోంమంత్రిని ఉద్దేశించి అన్న  మాటలు కావని, యావత్ మహిళా జాతిని, వారి ఆత్మగౌరవాన్ని ఘోరంగా అవమానించడమేనని మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ..  మహిళల పట్ల ఇలాంటి అసభ్యకర ధోరణిని ప్రదర్శించడం వైకాపా నేతల కుసంస్కారానికి నిదర్శనమని విమర్శించారు.

మరోవైపు  మంత్రి నారా లోకేష్ సైతం గుడివాడ అమర్నాథ్ పై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దళిత మహిళ సమాజంలో ఎదిగి, రాష్ట్రంలో అత్యున్నతమైన హోంమంత్రి పదవిని అధిరోహిస్తే..  ఓర్వలేకనే వైసీపీ నేతలు ఇలాంటి నీచమైన విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. ఒక మహిళా నాయకురాలి కట్టును, బొట్టును టార్గెట్ చేస్తూ మాట్లాడటం  వైసీపీ చేస్తున్న విషపూరిత, వికృత రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...