వందేమాతరం వివాదం.. రాజకీయ దుమారం.!

posted on: Aug 16, 2026 7:29AM

 

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో  ప్రజల్లో దేశభక్తి రగిలించిన జాతీయ గేయం వందేమాతరం చుట్టూ మళ్లీ రాజకీయ దుమారం చెలరేగింది. న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయమైన ఇందిరా భవన్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చోటుచేసుకున్న సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.పంద్రాగస్టు  వేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ గేయం పాడుతున్న సమయంలో ప్రవర్తించిన తీరుపై   విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. కాంగ్రెస్ వర్గాలు ఆ ఆరోపణలను, విమర్శలను ఖండించాయి.   ఈ వివాదం కేవలం ఒక రోజు కార్యక్రమానికి మాత్రమే పరిమితం కాకుండా, వందేమాతరం గేయానికి ఉన్న చారిత్రక నేపథ్యం, మతపరమైన భిన్నాభిప్రాయాలు,  ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన కొత్త చట్టం నిబంధనలపై కూడా పునరాలోచనకు దారితీసింది.  ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 15న జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో వందేమాతరం గేయాన్ని పూర్తి స్థాయిలో ఆలపించడం ప్రారంభించారు. గేయం ఆలపిస్తున్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సంజ్ఞలు చేయడం, అనంతరం రాహుల్ గాంధీ కూడా ఆ సంజ్ఞలను అనుసరించడం కేమెరాలలో కనిపించింది. ఇందేరే సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో బీజేపీ..  కాంగ్రెస్ నాయకత్వం జాతీయ గేయాన్ని పూర్తిగా పాడటానికి ఇష్టపడలేదని, అందుకే దానిని మధ్యలోనే నిలిపివేయడానికి ప్రయత్నించిందని   ఆరోపణలు చేసింది. అయితే కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ ఈ వ్యాఖ్యలను తప్పుపట్టారు. మల్లికార్జున్ ఖర్గే వయోభారం వల్ల చాలా సేపు నిలబడలేకపోయారని, ఆయనకు కుర్చీ తీసుకురావాల్సిందిగా మాత్రమే సోనియా గాంధీ సూచించారని, వందేమాతరాన్ని ఆపడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదని వివరణ ఇచ్చారు.  

ఈ ఘటన చోటుచేసుకున్న సమయానికి కొన్ని రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం,  పార్లమెంట్ ఒక కీలకమైన చట్టపరమైన నిర్ణయం తీసుకున్నాయి. జాతీయ గౌరవానికి భంగం కలిగించే నిరోధక సవరణ బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 1971 నాటి పాత చట్టానికి చేసిన ఈ సవరణ ద్వారా వందేమాతరం ఆలపించే సమయంలో ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగిస్తే లేదా అంతరాయం కలిగిస్తే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే  నిబంధనలను పొందుపరిచారు. పునరావృతంగా ఈ నేరానికి పాల్పడితే కనీసం ఒక ఏడాది జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఏఐసీసీ వేదికపై జరిగిన పరిణామాలు  ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  

అయినా.. వందేమాతరం చుట్టూ వివాదాలు రావడం ఇదే మొదటిసారి కాదు. బంకిం చంద్ర ఛటోపాధ్యాయ 1882లో రాసిన  ఆనంద్‌మఠ్  నవల ద్వారా ఈ పాట ప్రాచుర్యంలోకి వచ్చింది. 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ దీనికి సంగీతాన్ని సమకూర్చి కాంగ్రెస్ సమావేశాల్లో ఆలపించారు. 1906లో బెంగాల్ విభజన సమయంలో బారిసాల్‌లో జరిగిన ప్రాంతీయ సమావేశంలో వందేమాతరం పాడుతున్న ప్రతినిధులపై బ్రిటిష్ పోలీసులు   లాఠీఛార్జ్ చేశారు. నాటి నుండి ఇది స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రధాన నినాదంగా మారింది.

అయితే..  ఈ గేయంలోని మొదటి రెండు చరణాలు కేవలం మాతృభూమి సౌందర్యాన్ని కొనియాడుతుండగా, తర్వాతి చరణాలలో హిందూ దేవతల ప్రస్తావన,  ధార్మిక చిత్రణ ఉండటంతో కొన్ని వర్గాల నుండి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.  1937లో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు పాఠశాలలు, శాసనసభల్లో వందేమాతరం తప్పనిసరి చేయడాన్ని ముస్లిం లీగ్  వ్యతిరేకించింది. లక్నోలో జరిగిన తమ 25వ సమావేశంలో ముస్లిం లీగ్ నాయకుడు ముహమ్మద్ అలీ జిన్నా ఈ పాట ఏకేశ్వరోపాసన సూత్రాలకు విరుద్ధంగా ఉందని, ఇస్లామిక్ విశ్వాసాలకు భంగం కలిగిస్తున్నదని ఆరోపించారు. పెరుగుతున్న మత ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని 1937 అక్టోబర్‌లో జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన కలకత్తాలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అధికారిక,  జాతీయ సమావేశాలలో వందేమాతరం  మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని తీర్మానించింది. అభ్యంతరం లేని ఇతర గేయాలను కూడా పాడటానికి అనుమతి ఇచ్చింది.  

చట్టపరమైన,  రాజ్యాంగపరమైన కోణంలో చూస్తే, వందేమాతరానికి లభించిన గుర్తింపుపై కొన్ని స్పష్టమైన పరిమితులు ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ(ఏ) పౌరులు జాతీయ జెండాను,  జాతీయ గీతాన్ని  గౌరవించాలని నిర్దేశిస్తుంది కానీ జాతీయ గేయం అనే పదాన్ని ప్రస్తావించలేదు. 2017లో సుప్రీంకోర్టు ఒక పిటిషన్‌ను విచారిస్తూ రాజ్యాంగ రీత్యా  జాతీయ గేయం  అనే ప్రత్యేకాధికార భావన లేదని స్పష్టం చేసింది. అలాగే 2026 ప్రారంభంలో కేంద్ర హోంశాఖ అన్ని ఆరు చరణాలను ఆలపించాలని జారీ చేసిన సూచనలను సుప్రీంకోర్టు సమీక్షిస్తూ, అది కేవలం సలహా మాత్రమేనని, కచ్చితంగా పాటించాలనే నిర్బంధం లేదని వ్యాఖ్యానించింది.  అయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ వాతావరణంలో జాతీయ చిహ్నాలు,  గేయాలు తరచుగా రాజకీయ విమర్శలకు సాధనాలుగా మారుతున్నాయి. 

కాంగ్రెస్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం తన అధికారిక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వందేమాతరం ఆలపించకపోవడం కూడా ఈ వివాదానికి మరింత తోడైంది. సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలో ప్రసారమయ్యే దృశ్యాలు ప్రజల అభిప్రాయాలను వేగంగా ప్రభావితం చేస్తున్నాయి. నాయకులు ఇచ్చిన వివరణలు విశ్లేషణల కంటే రాజకీయ ఆరోపణలే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి.  సుదీర్ఘ చరిత్ర కలిగిన వందేమాతరం గేయం దేశ ఐక్యతకు, త్యాగానికి చిహ్నంగా నిలిచింది. 

చట్టపరమైన నిబంధనలు లేదా సవరణల ద్వారా పౌరుల భావోద్వేగాలను లేదా మతపరమైన విశ్వాసాలను ఎంతవరకు నియంత్రించవచ్చనేది ప్రశ్నార్థకమే.  గత తొమ్మిది దశాబ్దాలుగా నడుస్తున్న ఈ చర్చ..  ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌర స్వేచ్ఛ,  జాతీయ గౌరవం మధ్య సమతుల్యత ఏ విధంగా ఉండాలనే విషయమై విస్తృత చర్చకు కారణమౌతోంది. . భవిష్యత్తులో ఈ వివాదాలు ఏ మలుపు తిరుగుతాయో?  చట్టపరమైన సవరణలు అమలులోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో వేచి చూడాల్సి ఉంది.

- సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.     

Vande Mataram controversy, AICC,  Indira Bhavan, Congress BJP politics, 1937 Congress Working Committee, Prevention of Insults to National Honour

google-ad-img
    Related Sigment News
    • Loading...