రెండో పెళ్లి చేసుకుందని...మాజీ భార్యను చంపిన మాజీ భర్త
posted on: Feb 18, 2026 3:54PM

హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో బుధవారం చోటుచేసుకున్న దారుణ హత్య నగరాన్ని కలవరపరిచింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సునీత (30)ను ఆమె మాజీ భర్త మహేశ్ అత్యంత కిరాతకంగా హత్య చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ముందస్తు ప్రణాళికతో రెండు కత్తులు, కట్టర్లు, ఐదు లీటర్ల పెట్రోల్‌తో ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు ఆమెపై దాడి చేసి ప్రాణాలు తీశాడు. పోలీసుల దర్యాప్తులో సునీత రెండునెలల గర్భవతి అని తేలింది.
ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు సునీతకు ముందే ఒక వివాహం జరిగిన విషయం రెండో భర్త కుటుంబ సభ్యులకు తెలియకపోవడం మరింత షాక్‌కు గురిచేసింది. హత్య అనంతరం ఈ విషయం బయటపడటంతో బంధువులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. సునీత–మహేశ్‌లకు కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వివాహానంతరం ఇద్దరూ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. అక్కడే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో సునీత భారత్‌కు తిరిగి వచ్చింది. అనంతరం మహేశ్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేయడంతో పోలీసులు లుక్‌అవుట్ నోటీసు జారీ చేశారు.
దీంతో అతను పనిచేస్తున్న సంస్థ అతడిని భారత్‌కు పంపించింది. సునీత ఫిర్యాదుతో అతని వీసా, పాస్‌పోర్ట్‌లు కూడా రద్దయ్యాయి. కొన్ని నెలల క్రితం మహేశ్‌కు విడాకులు ఇచ్చిన సునీత, త్రినాథ్‌ను ప్రేమించి ఏడాది క్రితం పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ వనస్థలిపురంలోని గ్రీన్ సిటీ కాలనీలో నివసిస్తున్నారు. సునీత మరో వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక మహేశ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
రెండేళ్లుగా నిరుద్యోగిగా ఉన్న అతడు ఈ హత్యకు ప్రత్యేకంగా పథకం రచించాడు. సునీతను హత్య చేసిన తరువాత శవాన్ని మాయం చేయాలని మహేశ్ ప్రణాళిక వేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం కట్టర్లు, పెట్రోల్‌ను వెంట తెచ్చుకున్నాడు. అవసరమైతే ఇంటికి నిప్పంటించి ఆధారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బుధవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సునీతపై మహేశ్ ఆకస్మికంగా దాడి చేశాడు. కత్తులతో పలు మార్లు పొడిచిన తరువాత పూల కుండితో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. ఈ సమయంలో ఇంట్లోకి వచ్చిన అత్తను కూడా పెట్రోల్ పోసి తగలబెడతానంటూ బెదిరించాడు.
ఆమె అరుపులు విని అపార్ట్‌మెంట్ వాసులు చేరుకోవడంతో పారిపోవడానికి ప్రయత్నించిన మహేశ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. క్లూస్ టీం కీలక ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలు, విడాకులు, రెండో వివాహం నేపథ్యంలో ఏర్పడిన ప్రతీకార భావమే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రీన్ సిటీ కాలనీలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్యకు గురికావడం స్థానికులను కలచివేసింది. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






