చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. ఎందుకంటే?

posted on: Jul 23, 2026 4:30PM

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. ఇటీవల కొంత కాలంగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్న వల్లభనేని వంశీ ఈ లేఖ ద్వారా తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నించారు.  ఆయన రాసిన లేఖలో   పోలవరం కుడి కాల్వ ద్వారా పట్టిసీమ నీటిని గన్నవరం   మెట్ట భూములకు   సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ మోటార్ల నిలిపివేత చర్యలను తక్షణమే సమీక్షించి ఉపసంహరించుకోవాలని  కోరారు.

అయితే విశేషం ఏమిటంటే.. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు. ఆ లేఖలో గతంలో తాను గన్నవరం ఎమ్మెల్యేగా   కాలంలో అధికారుల నుంచి అనేక అభ్యంతరాలు వచ్చినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు చొరవతోనే  నిరాటంకంగా పట్టిసీమ నీటిని మెట్ట ప్రాంతాలకు అందించగలిగామని  పేర్కొన్నారు.  

అంతే కాదు.. వైసీపీ వట్టి సీమ అంటూ విమర్శలు గుప్పించిన పట్టిసీమను ఆయన అత్యంత ప్రాధాన్యమైన ప్రాజెక్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు.  గన్నవరం ప్రాంత రైతాంగానికి పట్టిసీమ ద్వారా  అందుతున్న ప్రయోజనాలను వివరించారు.  2015లో పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించడం వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులకు ఎంతో మేలు చేకూరిందని పేర్కొన్నారు.  ఆ సమయంలో   తాను గన్నవరం నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఉన్న సంగతిని గుర్తు చేస్తూ..  పోలవరం కుడి కాల్వ పక్కనే ఉన్న మెట్ట ప్రాంత గ్రామాల రైతులకు కూడా పట్టిసీమ నీటిని వినియోగించుకునే సదవకాశాన్ని అప్పటి చంద్రబాబు సర్కార్ కల్పించిందని ప్రశంసలు గుప్పించారు.   

Vallabhaneni Vamshi letter to CBN, Praises, Pattiseema, Babu, Vision

google-ad-img
    Related Sigment News
    • Loading...