కొత్త సిక్సర్ల మిషన్ వైభవ్ సూర్యవంశీ.. క్రిస్ గేల్

posted on: May 28, 2026 10:34AM

 

వేగవంతమైన సెంచరీ మిస్సైతేనేం.. వైభవ్ రికార్డుల వైభోగం మామూలుగా లేదుగా!

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. క్రిస్ గేల్ ఆల్‌టైమ్ సిక్సర్ల రికార్డు బద్దలు కొట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్  2026 సీజన్‌లో వైభవం ఒక అద్భుతం.  రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నఈ 15 ఏళ్ల బీహార్ యువ కెరటం, ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త ప్రపంచ రికార్డుతో క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేశాడు.  సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈ టీనేజ్ సంచలనం విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు రాబట్టి తృటిలో అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ రికార్డును మిస్ చేసుకున్నాడు.

అయితేనేం.. ఈ ఇన్నింగ్స్‌లో 334.48  స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 12 భారీ సిక్సర్లు, 5 ఫోర్లతో సన్‌రైజర్స్ బౌలింగ్ లైనప్‌ను తుత్తునియలు చేసేశాడు. ఆస్ట్రేలియా పేస్ స్టార్ పాట్ కమిన్స్ వేసిన ఓవర్లలో సైతం హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడి పవర్‌ప్లేలోనే రాజస్థాన్ జట్టు స్కోరును 80 పరుగులకు చేర్చాడు.  ఈ మెరుపు ఇన్నింగ్స్ ద్వారా వైభవ్ సూర్యవంశీ యూనివర్స్ బాస్  క్రిస్ గేల్ పేరిట ఉన్న 15 ఏళ్ల నాటి సుదీర్ఘ రికార్డును తుడిచిపారేశారు. 2012 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ క్రిస్ గేల్ 59 సిక్సర్లు బాదగా.. నిన్నటి వరకూ అంటే బుధవారం (మే 27) వరకూ అది ఎవరికీ సాధ్యం కాని రికార్డుగా ఉంది. అయితే 15ఏళ్ల యూనివర్శల్ బేబీ బాస్ ఆ రికార్డును తిరగరాశారు. 

ఇన్నాళ్లూ అది ఎవరికీ సాధ్యం కాని రికార్డుగా నిలిచింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు 53 సిక్సర్లతో ఉన్న వైభవ్, మ్యాచ్ తొలి 10 ఓవర్లు ముగియకముందే గేల్ రికార్డును దాటేశాడు. ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ మొత్తం సిక్సర్ల సంఖ్య ఇప్పుడు ఏకంగా 65కి చేరుకుంది. దీనితో ఒకే టీ20 టోర్నమెంట్‌లో లేదా ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఏకైక బ్యాటర్‌గా వైభవ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 

 వైభవ్ సూర్యవంశీ సృష్టించిన రికార్డుల పరంపర ఇక్కడితో ఆగలేదు. ఒకే టీ20 టోర్నమెంట్‌లో 600 పరుగుల మైలురాయిని దాటిన ప్రపంచంలోనే తొలి టీనేజర్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు. వైభవ్ ఈ సీజన్‌లో కేవలం 15 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.

గతంలో దేవదత్ పడిక్కల్ (580 పరుగులు), తిలక్ వర్మ (397 పరుగులు) పేరిట ఉన్న టీనేజ్ అత్యధిక పరుగుల రికార్డులను వైభవ్ పూర్వపక్షం చేసేశాడు. భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ (2016 సీజన్‌లో 38 సిక్సర్లు), రోహిత్ శర్మ (2015లో 28 సిక్సర్లు), అభిషేక్ శర్మ (2024లో 42 సిక్సర్లు) వంటి పవర్‌హౌస్ హిట్టర్ల సింగిల్ సీజన్ సిక్సర్ల రికార్డులను ఈ 15 ఏళ్ల కుర్రాడు దాటేయడం గమనార్హం. వైభవ్ సాధించిన ఈ చారిత్రాత్మక ఘనతపై క్రిస్ గేల్ స్వయంగా స్పందిస్తూ అతడిని క్రికెట్ ప్రపంచపు  కొత్త సిక్సర్ల మెషిన్  అని కొనియాడాడు. సచిన్ టెండూల్కర్ సైతం ఈ ఇన్నింగ్స్ అద్భుతమంటూ ప్రశంసల వర్షం కురిపించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...