Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...15 ఏళ్ల వయసులో 5 అవార్డులు.. బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీని నడిపించిన ఆ గురువు ఎవరు?
posted on: Jun 4, 2026 12:43PM

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒకే ఒక్క పేరు క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసింది. అదే 15 ఏళ్ల వయసులోనే అద్భుతాలు సృష్టించిన బిహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ బేబీ బాస్ ఏకంగా 16 మ్యాచ్‌లలో 237.30 భారీ స్ట్రైక్ రేట్‌తో, 48.50 అద్భుతమైన సగటుతో 776 పరుగులు సాధించి సరికొత్త రికార్డులు సృష్టించాడు. కేవలం 440 బంతుల్లోనే 1000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసి విండీస్ పవర్‌హౌస్ ఆండ్రీ రస్సెల్ రికార్డును సైతం బద్దలు కొట్టాడు. అతి పిన్న వయసులోనే ఆరెంజ్ క్యాప్ సాధించిన ఈ కుర్రాడు.. టోర్నీ ముగిసేసరికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (MVP), ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్, ఆరెంజ్ క్యాప్, మరియు సూపర్ సిక్సెస్ వంటి ఐదు ప్రతిష్టాష్టాత్మక అవార్డులను ఒకేసారి తన ఖాతాలో వేసుకుని చరిత్రకెక్కాడు. అయితే, మైదానంలో పరుగుల వరద పారించిన ఈ 15 ఏళ్ల బాల సంచలనం వెనుక, ఐపీఎల్ ఆసాంతం ఒక వ్యక్తి నీడలా వెంట నడిచారు. ఆ ఆసక్తికరమైన మెంటార్ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో డగౌట్ కావచ్చు, బౌండరీ లైన్ వెనుక కావచ్చు, అహ్మదాబాద్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత లేదా ప్రెజెంటేషన్ వేడుకల్లో కావచ్చు, చివరకు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాలను కలిసిన సందర్భాల్లోనూ వైభవ్ పక్కనే ఒక వ్యక్తి కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక ఇన్నింగ్స్‌లో సెంచరీ మిస్ అయి వైభవ్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు, అతడిని ఒక తండ్రిలా ఓదార్చి వెన్నుతట్టిన ఆ వ్యక్తి మరెవరో కాదు, రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమి భిందర్. వైభవ్‌కు ఒక గార్డియన్‌గా, మెంటార్‌గా వ్యవహరిస్తూ.. ఈ 15 ఏళ్ల చిన్నారిని క్రికెట్ ఒత్తిళ్ల నుంచి కాపాడుతూ వచ్చారు. రోమి భిందర్ సాధారణ వ్యక్తి కాదు; గతంలో ఇంగ్లాండ్‌లో క్లబ్ క్రికెట్ ఆడటంతో పాటు విదర్భ, మహారాష్ట్ర, నాగ్‌పూర్ యూనివర్సిటీల తరఫున జిల్లా స్థాయిలో ఆడిన అపార అనుభవం ఆయనకుంది. వరల్డ్ క్రికెట్ అకాడమీతో అనుబంధం కలిగి ఉండి, నాగ్‌పూర్ సమీపంలో ఒక అత్యాధునిక రెసిడెన్షియల్ క్రికెట్ అకాడమీని సైతం ఏర్పాటు చేస్తున్నారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా ఐపీఎల్‌తో ముడిపడి ఉన్న రోమి భిందర్, రాజస్థాన్ రాయల్స్ మొదటి సీజన్‌లో లైజన్ ఆఫీసర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆ తర్వాత అసిస్టెంట్ మేనేజర్‌గా, ఇప్పుడు కీలకమైన టీమ్ మేనేజర్‌గా ఎదిగారు. స్పోర్ట్స్ సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన రోమి భిందర్‌కు, యువ ఆటగాళ్లను మానసికంగా ఎలా సిద్ధం చేయాలో చాలా బాగా తెలుసు. అందుకే వైభవ్‌ను ఒత్తిడికి లోనుకాకుండా నిలబెట్టగలిగారు. ఈ ప్రయాణంలో ఒక వివాదం కూడా రేగింది. గువాహటిలో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్ సందర్భంగా డగౌట్‌లో వైభవ్ పక్కన కూర్చుని మొబైల్ ఉపయోగించినందుకు బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి, ఒక లక్ష రూపాయల జరిమానా విధించింది. అయితే, వైద్య కారణాల వల్లే అత్యవసరంగా ఫోన్ వాడాల్సి వచ్చిందని గుర్తించిన బోర్డు, ఆయన సుదీర్ఘ అనుభవాన్ని గౌరవిస్తూ కేవలం హెచ్చరికతో ఆ కేసు ముగించింది, పక్కనే ఉన్న వైభవ్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా చూసుకుంది.
ఐపీఎల్ ముగించుకుని వైభవ్ తన స్వగ్రామానికి చేరుకున్నప్పుడు కూడా రోమి భిందర్ బాధ్యతాయుతమైన మెంటార్‌గా వ్యవహరించారు. వైభవ్‌ను చూడటానికి అభిమానులు, మీడియా భారీ ఎత్తున తరలి వచ్చి, పూల వర్షం కురిపిస్తూ నినాదాలు చేస్తున్న ఆ కంగారులో.. జనం నుంచి రక్షణ కల్పిస్తూ వైభవ్‌ను సురక్షితంగా కారు వైపు నడిపించారు. జనం కారును చుట్టుముట్టడంతో డోర్ వేయడానికి ఇబ్బంది పడినప్పటికీ, రోమి దగ్గరుండి అంతా చక్కదిద్దారు. ఈ ప్రయాణంలో లెజెండ్స్ ప్రశంసలను కూడా రోమి పంచుకున్నారు. ఎంఎస్ ధోని వైభవ్‌ను చూసి ఈ పిల్లాడు ఎంతో పరిణతి చెందిన ఆటగాడిలా షాట్లు ఆడతాడు అని మెచ్చుకోగా, విరాట్ కోహ్లీ వైభవ్‌ను ప్రత్యేకంగా వెతుక్కుంటూ వచ్చి, ఎల్లప్పుడూ వినయంగా ఉంటూ కష్టపడాలని అమూల్యమైన సలహా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం త్వరలోనే శ్రీలంకలో జరగబోయే ఇండియా-ఏ, శ్రీలంక-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్ల త్రైపాక్షిక వన్డే సిరీస్‌కు వైభవ్ సిద్ధమవుతుండగా, అతని ఎదుగుదల వెనుక ఉన్న రోమి భిందర్ సేవలను క్రికెట్ ప్రపంచం కొనియాడుతోంది.


.webp)



