ఆ 11ఏళ్ల పాకిస్తానీ పాప... మోదీకి ఏం చెప్పిందో తెలుసా?

posted on: Mar 15, 2017 2:19PM

 

సోషల్ మీడియా వచ్చాక జనాల్లో క్రియేటివిటి కట్టలు తెంచుకుంటోంది. ఎవరికి ఏది కావాలంటే అది ప్రచారంలో పెట్టుకునే అవకాశం దక్కుతుండటంతో ఏ క్షణంలో ఏది జనంలోకి వస్తుందో అర్థం కావటం లేదు. అలాంటివే పబ్లిక్ లెటర్స్! ఇప్పుడు ఎవరైనా సరే ప్రధానమంత్రికి కూడా లేఖ రాయొచ్చు. దాన్ని ఆయన చూస్తారా లేదా అన్నది పక్కన పెడితే సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేసుకోవటం మాత్రం ఈజీ! తరువాతి రోజు కల్లా సోషల్ మీడియాను ఊపేసిన ఫలానా పబ్లిక్ లెటర్ ని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చర్చలోకి తెస్తుంది. అది అప్పుడు ఇంకొంత మందికి తెలుస్తుంది! కొన్నాళ్ల కలకలం... తరువాత అందరూ మరిచిపోతుంటారు!

 

అనగనగా పాకిస్తాన్ లోని లాహోర్లో ఒక అమ్మాయి. పేరు.. అకీదత్ నవీద్. వయస్సు పదకొండేళ్లు. అంత చిన్న వయస్సులోనే తను భారత ప్రధాని మోదీకి ఒక లేఖ రాసింది. దాంట్లో కమల ధళం ఉత్తర్ ప్రదేశ్ లో భారీ విజయం సాధించినందుకు శుబాకాంక్షలు తెలిపింది. అంతే కాదు, ఇక మీదట మోదీ ఓట్లు గెలిచినట్టే మనస్సులు గెలవాలని పిలుపునిచ్చింది! కేవలం భారతీయుల హృదయాలే కాదు... పాకిస్తానీల హృదయాలు కూడా మోదీ గెలవాలని పదకొండేళ్ల అకీదత్ ఆకాంక్షించింది! గతంలో సుష్మా స్వరాజ్ కు భారత్ , పాక్ మధ్య శాంతి నెలకొల్పాలని ఆశిస్తూ అకీదత్ ఒక లెటర్ రాసిందట! ఇప్పుడు మన ప్రధానికే శాంతి స్థాపన ఆవశ్యకత వివరిస్తూ పబ్లిక్ లెటర్ గురి పెట్టిన అకీదత్ ... అందులో బుల్లెట్ల బదులు బుక్స్, గన్నుల బదులు పేదలకు మందులు కొందామని సందేశం ఇచ్చింది!

 

ఒక పదకొండేళ్ల అమ్మాయి సమాజం గురించి ఆలోచించటమే గొప్ప అంటే... భారతదేశంలోని ఒకానొక రాష్ట్రమైన యూపీలో బీజేపి గెలిస్తే ... అది కూడా ఆ స్కూలుకెళ్లే పాపకి తెలిసిపోయింది! ఇంత రాజకీయ జ్ఞానం, అవగాహన ఒక బడికెళ్లే పాపకి వుండటం సాధ్యమేనా? ఒకవేళ వున్నా ఏకంగా మోదీకి సలహాలు , సూచనలు ఇస్తున్న అకీదత్ తన స్వంత దేశంలోని పాలకులకి ఏమీ చెప్పకపోవటానికి కారణం ఏంటి? యుద్ధం పోయి శాంతి నెలకొనాలంటే ఇండియా చేయాల్సిన దాని కన్నా ఆ పాప స్వదేశమైన పాక్ చేయాల్సిన కార్యక్రమమే చాలా వుంది! ఈ విషయం ఎందుకు అకీదత్ కి అర్థం కావటం లేదు?

 

సోషల్ మీడియా ప్రభంజనం తరువాత ఇలా చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద లెటర్ లు రాయటం, వీడియో మెసేజ్ లు ఇవ్వటం బాగా ఎక్కువైపోయింది. చాలా సందర్బాల్లో వీరి వెనుక పెద్దలు ఎవరో వున్నారని చెప్పటం ఏమంత కష్టం కాదు. కేవలం అందరి దృష్టీ ఆకర్షించటానికి చిన్న పిల్లల్ని వాడుకుంటున్నారని బలంగా చెప్పవచ్చు. ప్రధానికి లెటర్ రాయటం వెనుక ఎవరికీ ఎలాంటి దురుద్దేశాలున్నాయని మనం అనటానికి అవకాశం లేదు. కాని, పదకొండేళ్ల అకీదత్ ను అడ్డం పెట్టుకుని ఏదో ఒక విధంగా జనం దృష్టిని ఆకర్షించాలనే ప్రయత్నం జరిగిందన్నది మాత్రం నిజం! మీడియా ఇలాంటి వాటికి ఆచితూచి ప్రాధాన్యత ఇస్తేనే బావుంటుంది...

google-ad-img
    Related Sigment News
    • Loading...