కోమటిరెడ్డి కుయ్యో మొర్రో

 

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మురికి గుంట హుస్సేన్ సాగర్‌ పూర్తిగా క్లీన్ అయిపోయి, మంచినీటి సరస్సుగా మారిపోయిందంటే నమ్మొచ్చుగానీ, కాంగ్రెస్ పార్టీ బాగుపడిందంటే మాత్రం ఎంతమాత్రం నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బాగుపడటం అనేది అసంభవం... అసంభవం.. అసంభవం. ఈ పార్టీ అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాల విషయం, అవినీతి, అక్రమాల సంగతి అలా వుంచితే, పార్టీలో లుకలుకల విషయంలో ఇలాంటి పార్టీ యావత్ ప్రపంచంలో మరొకటి వుండదు. పదవిలో వున్నవాడి మీద నిరంతరం ఏడ్చేవాళ్ళు పక్కనే వుంటారు. పదవి పొందినవాడి సీటు కిందకి నీళ్ళు తేవడానికి శాయశక్తులా ప్రయత్నించేవాళ్ళూ తక్కువమేమీ కాదు. కాంగ్రెస్ పార్టీ అంత గొప్ప పార్టీ కాబట్టే ఇక ఈ పార్టీని ఇండియాలో ఉండనిస్తే లాభం లేదని దేశ ప్రజలు డిసైడ్ అయ్యారు. అందుకే రాష్ట్రాల వారీగా కాంగ్రెస్ పార్టీని సాగనంపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరిగింది. తెలంగాణ ఇచ్చిందన్న కృతజ్ఞత కూడా చూపించకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టారు. ఇంత జరిగినా స్థానిక కాంగ్రెస్ నాయకత్వంలో మార్పు రాకపోవడమే సహజమైన విషయం.

 

పొన్నాల లక్ష్మయ్య నిన్నటి వరకూ పీసీసీ అధ్యక్షుడిగా వుండేవారు. ఆయన పదవిలో ఉన్నంతకాలం ఆయన్ని ఎవరూ మనశ్శాంతిగా పనిచేయనివ్వలేదు. ఎమ్మెల్యేగా కూడా గెలవని పొన్నాల పీసీసీ అధ్యక్ష పదవికి అనర్హుడని కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే విమర్శించేవారు. అలాంటివారిలో మొదటి వరసలో నిలిచిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అర్హులకే ఆ పదవి ఇవ్వాలని ఆయన గాఠ్ఠిగా చెప్పేవారు. అంటే నేనే అర్హుడిని కాబట్టి ఆ పదవి తనకే ఇవ్వాలన్నది ఆయన చెప్పకనే చెప్పేవారు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన ఆవేదనలో సగాన్నే పట్టించుకుంది. మిగతా సగాన్ని వదిలేసింది. పీసీసీ అధ్యక్షుడిని మార్చాలన్న డిమాండ్‌ని నెరవేర్చింది. అయితే ఆ స్థానంలో కోమటిరెడ్డిని కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టింది. దాంతో అలిగిన కోమటిరెడ్డి తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రెస్‌మీట్ పెట్టి మరీ కాంగ్రెస్ అధిష్ఠానం ఏకపక్షంగా వ్యవహరించిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా ఏకపక్షంగానే చేస్తుందన్న విషయాన్ని ఆయన మరచిపోయినట్టున్నారు. పీసీసీ అధ్యక్షుడిని నియమించే ముందు పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ల అభిప్రాయాలను తీసుకుని వుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అంటే, అలా అభిప్రాయాలు తీసుకుని వుంటే అందరూ తనపేరే చెప్పేవారన్న అమాయకత్వంలో కోమటిరెడ్డి ఉన్నారన్నమాట. చాలామంది కాంగ్రెస్ నాయకులు కొత్త పీసీసీ అధ్యక్షుడికి సహకరించరని ఆయన అన్నారు. అంటే కాంగ్రెస్‌లో కుమ్ములాటల కుంపటి ఆరదన్న నిజాన్నే ఆయన నోటితో చెప్పారన్నమాట. కుమ్ములాడుకోండి.. మీ ఇష్టం వచ్చినట్టు కుమ్ములాడుకోండి.. మీరెంత కుమ్ములాడుకున్నా కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే చెడిపోయేదేమీ లేదు!