ఇరాన్ యుద్ధంలో 42 విమానాలు కోల్పోయిన అమెరికా.. అగ్రరాజ్యానికి కోలుకోలేని దెబ్బ

posted on: May 21, 2026 9:33AM

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక బలగాలు కలిగిన అమెరికాకు ఇరాన్ యుద్ధంలో ఊహించని భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్‌పై అమెరికా జరిపిన సైనిక చర్య  ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ లో అమెరికా ఏకంగా 42 అత్యాధునిక యుద్ధ విమానాలు, డ్రోన్లు నష్టపోయింది.  అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ప్రారంభించిన ఈ సుదీర్ఘ పోరాటంలో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు అమెరికా వాయుసేనకు చుక్కలు చూపించాయి.

అత్యంత సురక్షితమైనవని భావించే ఐదో తరం యుద్ధ విమానాలు సైతం ఈ యుద్ధంలో మట్టికరవడం అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులను సైతం   ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శత్రువుల రాడార్లకు చిక్క కుండా దూసుకెళ్లే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎఫ్-35ఏ లైట్నింగ్ 2   స్టెల్త్ ఫైటర్ జెట్‌ను ఇరాన్ దళాలు కూల్చివేసినట్లు స్వయంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సోషల్ మీడియా వేదికగా గర్వంగా ప్రకటించారు.

ఈ అధికారిక నివేదిక ప్రకారం అమెరికా కోల్పోయిన వైమానిక సంపదలో నాలుగు ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ( యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిలో మూడు విమానాలు కువైట్ ఆకాశంలో  ఫ్రెండ్లీ ఫైర్  కారణంగా దెబ్బతినగా.. నాల్గవది ఇరాన్ సరిహద్దుల్లో కూలిపోయింది. అంతేకాకుండా, భూతలంపై ఉన్న శత్రువులను తుత్తునియలు చేసే ఒక ఏ-10 థండర్‌బోల్ట్ 2,  గ్రౌండ్ అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్, గాల్లోనే ఇంధ నాన్ని నింపే ఏడు భారీ కేసీ-135 స్ట్రాటోట్యాంకర్లు, అలాగే..  నిఘా అవసరాల కోసం వాడే ఒక ఈ-3 సెంటినల్ అవాక్స్   విమానం,ఇంకా  ప్రత్యేక ఆపరేషన్ల కోసం ఉపయోగించే రెండు ఎమ్‌సీ-130జే కమాండో 2  రవాణా విమానాలతో పాటు శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఒక హెచ్‌హెచ్-60డబ్ల్యూ జాలీ గ్రీన్ 2 (  రెస్క్యూ హెలికాప్టర్ కూడా ఉన్నాయి. 

అయితే అన్నింటికంటే ఘోరమైన దెబ్బ అమెరికా డ్రోన్ రంగానికి తగిలింది. నిరంతర నిఘా,  క్షిపణి దాడులకు పేరొందిన 24 అత్యాధునిక ఎమ్క్యూ-9 రీపర్  డ్రోన్లు,  ఒక ఎమ్క్యూ-4సీ ట్రైటాన్  నిఘా డ్రోన్ ఇరాన్ గగనతలంలో నేలకూలాయి. రాడార్లను అడ్డుకుంటూ ఇరాన్ లోపలికి చొచ్చుకెళ్లిన ఈ డ్రోన్లను ఇరాన్ రక్షణ క్షిపణులు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ఇరాన్ యుద్ధానికి సంబంధించి పెంటగాన్ అంచనా వేసిన సైనిక వ్యయం ఏకంగా 29 బిలియన్ డాలర్లకు అంటే దాదాపు  2.4 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని పెంటగాన్ ఫైనాన్స్ చీఫ్ జూల్స్ డబ్ల్యూ హర్స్ట్ 3 సెనేట్ కమిటీ ముందు అంగీకరించారు.

కూలిపోయిన లేదా దెబ్బతిన్న అధునాతన యుద్ధ విమానాలను పునరుద్ధరించడానికి.. కొత్త వాటిని తయారు చేయడానికి ఈ నిధులు అవసరమవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికత కలిగిన సూపర్ పవర్ దేశాలైనా సరే..  పటిష్టమైన క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ కలిగిన దేశాలతో తలపడితే ఎలాంటి భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుందో   ఇరాన్-అమెరికా యుద్ధం ప్రపంచానికి కళ్లకు కట్టింది. ప్రస్తుతానికి యుద్ధ విరామం ప్రకటించినప్పటికీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...