డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక లావాదేవీలపై దుమారం.. అమెరికా రాజకీయాల్లో నైతిక సంక్షోభం!

posted on: May 23, 2026 3:52PM

అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్   తీవ్రమైన విమర్శల వలయంలో చిక్కుకున్నారు. ఆయన వైట్ హౌస్ అధికారాలను ఉపయోగించుకుని వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, భారీ ఆర్థిక లావాదేవీలు, ఆయన వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటంపై అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలు కేవలం పరిపాలనా లోపాలను మాత్రమే కాకుండా, అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పణంగా పెడుతున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.  తాజా నివేదికల ప్రకారం, ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలోనే ట్రంప్ అసాధారణ రీతిలో వేల సంఖ్యలో షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు జరిపినట్లు వెల్లడైంది. లెక్కింపు ప్రకారం ఆయన రోజువారీగా మరియు గంటల వ్యవధిలో జరిపిన ట్రేడింగ్ పరిమాణం అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తికి ఉండాల్సిన నైతిక నియమావళిని ఉల్లంఘించేలా ఉందని విమర్శకులు గొంతెత్తుతు న్నారు. 

గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు కూడా అధికారంలో ఉంటూ ఇంతటి క్రియాశీలక ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనలేదనీ.. ఇది అత్యంత ప్రమాదకరమైన సంప్రదాయానికి తెరలేపుతోందని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం చట్టాల పరిధిలోనే కాకుండా, నైతిక విలువలకు ఈ చర్యలు విరుద్ధంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  ఈ ఆర్థిక లావాదేవీల్లో ప్రముఖ అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఇంటెల్,  డెల్ వంటి కంపెనీల షేర్లు ఉండటం ఈ వివాదాన్ని మరింత క్లిష్టంగా మార్చింది. రక్షణ శాఖకు సంబంధించిన కీలక ఒప్పందాల ప్రకటనలు వెలువడటానికి ముందే ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం వెనుక  ఇన్సైడర్ ట్రేడింగ్  ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. 

ముఖ్యంగా చైనాకు కృత్రిమ మేధస్సు (ఏఐ) చిప్‌ల సరఫరాకు సంబంధించిన ప్రభుత్వ అనుమతులు వచ్చే లోపే ఎన్విడియా షేర్లను కొనుగోలు చేయడం, అలాగే డెల్ సంస్థను బహిరంగంగా ప్రశంసించడానికి కొద్ది రోజుల ముందే ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం వంటివి అధికారిక నిర్ణయాలు వ్యక్తిగత లాభాల కోసమేనా అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.  మరోవైపు, న్యాయ శాఖ పరిధిలో ఏర్పాటైన ఒక భారీ నిధికి సంబంధించిన నిధుల పంపిణీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో నష్టపోయిన వారి సహాయార్థం ఉద్దేశించిన ఈ నిధులు..  ప్రస్తుతం ట్రంప్ రాజకీయ మిత్రులకు, జనవరి 6 నాటి క్యాపిటల్ హిల్స్ ఘటనతో సంబంధం ఉన్న అనుచరులకు చేరేలా వ్యూహాత్మకంగా మార్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నిధుల కేటాయింపులపై సాధారణ న్యాయస్థానాల పర్యవేక్షణ,  సమీక్షలను పరిమితం చేయడం వల్ల పారదర్శకత పూర్తిగా లోపించిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజాధనం ఏ ప్రాతిపదికన పంపిణీ అవుతోందో స్పష్టమైన సమాధానాలు లేకపోవడం ఈ రాజకీయ వివాదాన్ని మరింత పెద్దది చేస్తోంది.  గతంలో క్యాపిటల్ హిల్ ముట్టడి కేసుల్లో నిందితులుగా ఉన్న తన మద్దతుదారులకు ట్రంప్ క్షమాభిక్షలు ప్రసాదించడం అమెరికా అంతటా తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. 

ఇప్పుడు వారికి చట్టపరమైన రక్షణ కల్పించడమే కాకుండా..  ప్రభుత్వ నిధుల రూపంలో ఆర్థిక ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నారనే వార్తలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. ఒక దేశాధినేత తనకు అనుకూలంగా ఉన్న వర్గాలను శిక్షల నుంచి కాపాడి..  ఆపై ప్రజాధనాన్ని వారికి మళ్లించడం అమెరికా రాజ్యాంగం నిర్దేశించిన నియంత్రణలు, సమతుల్యత చెక్స్ and బ్యాలెన్సెస్) వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని తీసుకువస్తోంది. ఇది కాంగ్రెస్ పర్యవేక్షక అధికారాలను,  న్యాయవ్యవస్థ స్వతంత్రతను సవాలు చేసేలా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  ఇదే కాకుండా..  ట్రంప్ కుటుంబ సభ్యులకు డిజిటల్ కరెన్సీ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు ఉన్న నేపథ్యంలో..  క్రిప్టోకరెన్సీ రంగానికి నిబంధనలను భారీగా సడలించడం కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ విధానపరమైన మార్పులు మార్కెట్ పురోగతి కోసం చేసినవిగా కనిపించినప్పటికీ..  అంతర్లీనంగా అధ్యక్షుడి కుటుంబ వ్యాపార ప్రయోజనాలకు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయనే ఆరోపణలను తోసిపుచ్చలేమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ విధానాల రూపకల్పన స్వంత లాభాల కోసం వాడటం వల్ల కాలక్రమేణా ప్రభుత్వ సంస్థల పట్ల,  పాలకుల పట్ల సామాన్య ప్రజలలో నమ్మకం పూర్తిగా సడలిపోయే ప్రమాదం ఉంది.  

ఈ పరిణామాలన్నీ అమెరికా రాజకీయ చరిత్రలో ఒక అసాధారణ నైతిక సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. గతంలోనూ అనేక మంది అధ్యక్షులు ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ..  ఒకే సమయంలో క్రియాశీలక ట్రేడింగ్, కీలక ప్రభుత్వ నిర్ణయాలు, మిత్రులకు నిధుల పంపిణీ,   నియంత్రణల సడలింపు వంటివన్నీ ఒకే దారిలో సాగడం ఇదే మొదటిసారి. ఈ ఆరోపణలు కేవలం ఒక వ్యక్తిగత వైఫల్యంగా కాకుండా.. మొత్తం ప్రభుత్వ పాలనా సంస్కృతినే కలుషితం చేసే విధంగా మారుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తంగా ఈ వివాదాలు కేవలం తాత్కాలిక రాజకీయ విమర్శలుగా మిగిలిపోయేలా కనిపించడం లేదు. ఇవి ప్రజాధన దుర్వినియోగం, మార్కెట్ శక్తుల ప్రభావితం,  రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తి వంటి ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలను ప్రశ్నిస్తున్నాయి. ఈ ఆరోపణలు భవిష్యత్తులో న్యాయస్థానాలలో నిలబడతాయా లేదా అన్నది పక్కన పెడితే..  అమెరికా సమాజంలో,  అంతర్జాతీయ వేదికపై ఆ దేశ రాజకీయ నైతికతపై ఇప్పటికే ఒక పెద్ద నల్లటి మచ్చను మిగిల్చాయని చెప్పక తప్పదు. దర్యాప్తు సంస్థల తదుపరి చర్యలు,  కాంగ్రెస్ స్పందనపైనే ఈ సంక్షోభం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. 

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.   

google-ad-img
    Related Sigment News
    • Loading...