ఆలస్యం అమృతం విషం.. యూపీఏ ఆలస్యమే భారత్ కు శాపమా?

posted on: Apr 11, 2026 5:13PM

 వేగంగా అభివృద్ధి చెందుతున్న  ఇండియాకి ఇంధన భద్రత అన్నతి ఒక అతి పెద్ద అవరోధంగా మారింది.  గత రెండు దశాబ్దాల్లో భారత్ వ్యూహాత్మక తప్పిదాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు ఉన్నాయి.   ముఖ్యంగా యూపీఏ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటికీ పెద్ద ఎత్తున చర్చ నడుస్తూనే ఉంది.  అంతర్జాతీయ రాజకీయాలు, పొరుగు దేశాలతో ఉన్న సంబంధాల కారణంగా ఈ రంగానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులను భారత్ చేజార్చుకుంది.  వీటిలో ముఖ్యమైనది ఇరాన్ నుంచి పాకిస్థాన్ మీదుగా సహజవాయువు అందించేందుకు ఉద్దేశించిన పీస్ పైప్ లైన్ ప్రాజెక్టు  అంటే ఇరాన్ పాకిస్థాన్ ఇండియా (ఐపీఐ)  ప్రాజెక్ట్. ఇరాన్ నుండి పాకిస్థాన్ మీదుగా భారత్‌కు సహజ వాయువును అందించే లక్ష్యంతో  ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించారు.

ఈ ప్రాజెక్టును  పది బిలియన్ డాలర్ల వ్యయంతో  2,700 కిలోమీటర్ల పొడవుతో ఈ పైల్ లైన్ చేపట్టాలని భావించారు. అయితే.. అమెరికా ఒత్తిడి,  అలాగే పాకిస్థాన్   ద్వారా గ్యాస్ తరలింపు విషయంలో తలెత్తిన భద్రతా పరమైన సందేహాలు, అనుమానాలు ఈ ప్రాజెక్టు ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అలాగే  ఇరాన్‌పై ఉన్న ఆంక్షలు కూడా ఈ ప్రాజెక్ట్  నిలిచిపోవడానికి ప్రధాన కారణం.

ఇక  మయన్మార్ గ్యాస్ ప్రాజెక్టు. మయన్మార్‌లో గెయిల్ సంస్థ గ్యాస్ నిల్వలను కనుగొన్నప్పటికీ, దానిని భారత్‌కు తెచ్చుకోవడంలో  ఇండియా విఫలమైంది.  మయన్మార్ నుండి బంగ్లాదేశ్ మీదుగా భారత్‌కు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ తరలించే ప్రయత్నం జరిగినప్పటికీ బంగ్లాదేశ్ తో ఒప్పందం విషయంలో సమస్యలు తలెత్తాయి.  దీంతో ఈ ప్రాజెక్టు విషయంలో భారత్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది. ఈ జాప్యాన్ని చైనా తనకు అనుకూలంగా మలచుకుని  మయన్మార్‌తో ఒప్పందం చేసుకుంది. ఫలితంగా ఇండియాకు రావాల్సిన  గ్యాస్   పైప్‌లైన్ ద్వారా చైనాకు చేరుతోంది.  

ప్రస్తుతం ఇండియా ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతోంది.  ఇది డిపెండెన్సీ ఏటికేడు పెరుగుతూనే వస్తోంది. 2005లో ఇండియా ఇంధన దిగుమతులు 70 శాతం ఉండగా, 2025 నాటికి అవి 88 శాతానికి చేరాయి. యూపీఏ హయాంలో నిర్ణయాలు తీసుకోవడంలో జరిగిన తాత్సారం కారణంగానే ఇంధన భ్రదత విషయంలో భారత్ వెనుకబడిందన్న విమర్శలు నేటికీ ఉన్నాయి.

ఇక గతంలోని లోపాలను విమర్శించుకుంటూ కూర్చోవడం కంటే దిగుమతులపై ఆధారపడటం తగ్గించి స్వయం సమృద్ధి సాధించే దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగకుండా స్వతంత్రంగా దేశ ప్రయోజనాలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. గతం గత: అన్నట్లుగా యూపీఏలో జరిగిన తప్పిదాలపై విమర్శలతో కాలం గడపడం మాని ఆ తప్పిదాలనుంచి గుణపాఠాలు నేర్చుకుని ఇంధన విషయంలో స్వావలంబనవైపు అడుగులు వేయడం ఇప్పుడు భారత్ ముందున్న తక్షణ కర్తవ్యం.  

google-ad-img
    Related Sigment News
    • Loading...