హైదరాబాద్ లో నేలపైనే ట్రాఫిక్ సిగ్నల్స్ !
posted on: Jul 3, 2019 9:33AM

హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది, ఈ ట్రాఫిక్ లో చిక్కుకున్న ఎవరికైనా మహా చిరాకుగా ఉంటుంది. రోజురోజుకూ రద్దీ పెరగడమే కాక తగ్గే సూచనలు మాత్రం కనపడడం లేదు. మెట్రో సర్వీసులు మొదలయితే ట్రాఫిక్ తగ్గి, ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని భావించినా అదేమీ తగ్గలేదు. మెట్రో సర్వీసులు కూడా హౌస్ ఫుల్ నడుస్తున్నా ట్రాఫిక్ కూడా పెరిగిందే తప్ప తగ్గలేదు. ఇక రద్దీ ఉన్నపుడూ చాలామంది సహజంగానే కొందరు సిగ్నల్ జంప్ చేసి వెళ్లిపోతుంటారు.
అయితే ఇకనుంచి ఇలాంటి సిగ్నల్ జంప్ ఆటలు సాగవు. దానికోసం హైదరబాద్ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. అదేంటంటే ఇప్పటి దాకా మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే చౌరస్తాలో ఎదురుగా స్తంబానికి ఉండే లైట్స్ మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను నేలకు దించి రోడ్డు మీదనే ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో ఇలా నేల మీద ఏర్పాటు చేయడం వలన సిగ్నల్ జంపింగ్ లకు అడ్డుకట్టపడడంతోపాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయని, చౌరస్తాల వద్ద ట్రాఫిక్ సాఫీగా సాగిపోతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
అనలాగ్ అనే ఒక డిజిటల్ ల్యాబ్ సహకారంతో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు కూడలి వద్ద వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. అవి ఎలా ఉంటాయంటే జీబ్రా క్రాసింగ్ కంటే ముందే వాహనచోదకులకి కనిపించేలా వీటిని ఏర్పాటు చేయడంతో సిగ్నల్ ఉల్లంఘనలు తగ్గుతాయని పోలీసులు భావిస్తున్నారు.ఈ సిగ్నళ్ల ఏర్పాటు వల్ల వాహనదారులు రెడ్‌లైట్ దాటి ముందుకెళ్లే సాహసం చేయలేరు. ఒకవేళ వెళ్తే సిగ్నల్ జంప్ చేసినట్టే. అలాగే, వీటి ఏర్పాటు వల్ల పాదచారులు ఇప్పుడు స్వేచ్ఛగాజీబ్రాక్రాసింగ్ లను ఉపయోగించుకుని రోడ్డు దాట ప్రయత్నం చేయవచ్చు. ప్రస్తుతం కేబీఆర్ పార్క్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వీటిని త్వరలోనే నగరమంతా విస్తరించనున్నారు.






