తెలంగాణకీ వరాలిస్తే బాగుండేది!

posted on: Jul 10, 2014 6:21PM

 

నరేంద్రమోడీ ప్రభుత్వం తాను సమర్పించిన మొదటి బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వరాల జల్లు కురిపించింది. ఆంధ్రప్రదేశ్‌కి విషయంలో చాలా ఉదారంగా వ్యవహరించి వరాల జల్లుకు కురిపించిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పొరుగునే వున్న తెలుగు రాష్ట్రం తెలంగాణ మీద మాత్రం ఒక్క చినుకు మాత్రమే కురిపించింది. అది కూడా తెలంగాణలో ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటు. అయితే ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన ప్రస్తావన విభజన చట్టంలోనే వుంది. అంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రస్తావించిన తెలంగాణకు ఉద్యానవన విశ్వవిద్యాలయం పాతదే తప్ప కొత్త వరం కాదు. అయితే, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఆ ప్రాంత నాయకులకు బాధని కలిగిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆవేదనను మీడియాతో పంచుకున్నారు. తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా నిర్దయగా వ్యవహరించిందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రతిపక్షంలో వున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ నాయకులు నమ్మినా నమ్మకపోయినా తెలుగుతల్లికి రెండు కళ్ళలో ఒక కన్ను ఆంధ్రప్రదేశ్ అయితే మరో కన్ను తెలంగాణ రాష్ట్రం. మరి ఇప్పుడు తెలుగుతల్లి పరిస్థితి ఒక కంట పన్నీరు, ఒక కంట కన్నీరు అన్నట్టుగా వుంది. ఒక రాష్ట్రంలోని తన బిడ్డలు బడ్జెట్‌లో లభించిన ప్రోత్సాహంతో ఉత్సాహంగా ఉరకలు వేస్తుంటే, మరో రాష్ట్రంలో వున్న తెలుగు బిడ్డలు బడ్జెట్‌లో ఎలాంటి ప్రోత్సాహకాలు లేక బాధపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, తెలంగాణ నాయకులు సీమాంధ్ర ప్రజలను ఎంతగా తిట్టిపోస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణకు కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని వరాలు ప్రకటిస్తే బాగుండేదన్న అభిప్రాయాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...