బ్రహ్మపుత్ర నదిలో అండర్ వాటర్ ట్విన్ టన్నెల్ !
posted on: Feb 16, 2026 8:14AM

అస్సాం గడ్డపై రవాణా విభాగానికి సంబంధించి ఇంజినీరింగ్ అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఈశాన్య భారతాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక అడుగు వేసింది. అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో దేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోనే రెండోదైన రోడ్డు, రైలు అండర్ వాటర్ ట్విన్ టన్నెల్ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తాజాగా పచ్చజెండా ఊపింది. గోహ్‌పూర్-నుమాలిగఢ్ మధ్య నిర్మించనున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ కోసం 18,662 కోట్ల రూపాయలు కేటాయించారు.
ప్రస్తుతం నేషనల్ హైవే-715 మీదున్న నుమాలిగఢ్ నుంచి హైవే-15 పైనున్న గోహ్‌పూర్‌కు చేరుకోవాలంటే సుమారు 240 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. కాజీరంగ నేషనల్ పార్క్, బిశ్వనాథ్ పట్టణం మీదుగా సాగే ఈ ప్రయాణానికి దాదాపు 6 గంటల సమయం పడుతుంది. అయితే బ్రహ్మపుత్ర నది కింద నిర్మించే ఈ నూతన సొరంగ మార్గం అందుబాటులోకి వస్తే.. ఈ దూరం భారీగా తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా కేవలం 20 నిమిషాలకు కుదించబడుతుంది. ఇది అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి రాష్ట్రాల రవాణా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేస్తుంది.
ఈ ప్రాజెక్టు కేవలం ప్రయాణ సౌకర్యం కోసం మాత్రమే కాకుండా.. రక్షణ పరంగా కూడా భారత్‌కు అత్యంత కీలకం కానుంది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలకు సరుకు రవాణా, సైనిక కదలికలను వేగవంతం చేసేందుకు ఈ సొరంగ మార్గం ఎంతగానో దోహదపడుతుంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ కేవలం రెండు ప్రాంతాలను కలపడమే కాకుండా.. 11 ఆర్థిక కేంద్రాలు, 3 సామాజిక కేంద్రాలను అనుసంధానిస్తుంది. 4 ప్రధాన రైల్వే స్టేషన్లు, 2 విమానాశ్రయాలు, 2 అంతర్గత జలమార్గాలకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ఇంజినీరింగ్-ప్రొక్యూర్‌మెంట్, కన్స్ట్రక్షన్ మోడల్‌లో దీనిని నిర్మించనున్నారు. ఈ మెగా ప్రాజెక్టు వల్ల లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గడమే కాకుండా ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకోనున్నాయి.


.webp)
.webp)


