ఉండవల్లి ఉపమానాలు.. శ్రీవారి భక్తుల్లో ఆగ్రహావేశాలు
posted on: Feb 11, 2026 8:23AM
.webp)
ఉండవల్లి అరుణ్ కుమార్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తుంటారన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఆయన తన వాక్చాతుర్యంతో తిమ్మిని బమ్మిని చేస్తారు. ఇప్పుడు తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం విషయంలో కూడా అదే చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
మనం తాగే టీ కప్పు, బాత్రూం కమోడ్ రెండూ ఒకటే పింగాణీ మెటీరియల్ తో తయారు చేస్తారన్న ఉండవల్లి అరుణ్ కుమార్.. అంతమాత్రం చేత రెండూ ఒకటై పోవు. అసలా పోలిక ఎలా తెస్తారు? ఆ సిరామిక్ కప్పుల్లో టీ తాగే వారికి ఎలా ఉంటుందీ? అంటూ లాజిక్ లేవదీశారాయన, అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంలో బాత్రూంలో వాడే యాసిడ్స్ వంటి పదార్ధం కలిపారని అనడానికి ఆయనీ విధంగా కౌంటరిచ్చారన్న మాట. దీనిపైనే నెటిజనులు ఉండవల్లిపై ఫైర్ అవుతున్నారు.
ఇంతకీ జగన్ హయాంలో లడ్డూ తయారీ ప్రసాదంలో కలిపిన ఆ రసాయనాన్ని దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్నారు. కొరియాకు చెందిన ఐఎల్ షిన్ వెల్స్ అనే ఒక కంపెనీ తయారు చేసే మోనో గ్లిజరైడ్స్ అనే రసాయనాన్ని ఈ కల్తీ నెయ్యిలో వాడినట్టుగా సిట్ దర్యాప్తులో తేలింది. అసలిది నెయ్యే కాదు. కేవలం ల్యాబ్ పరీక్షల్లో మాత్రమే నెయ్యిలా కనిపించే ఒకానొక కృత్రిమ మిశ్రమం. ఈ రసాయనాన్ని వంట నూనెల పేరిట నకిలీ బిల్లులు సృష్టించి.. మరీ దిగుమతి చేసుకున్నారని గుర్తించారు.
ఈ లెక్కన చూస్తే శ్రీవారి భక్తులను, హిందువులను మోసం చేయడానికి ఎంతటి కుట్ర జరిగిందో అవగతమౌతుంది. ఒక ఇన్వెస్టిగేటివ్ అడ్వకేట్ గా ఉండవల్లి బయట పెట్టాల్సిన విషయాలు ఇవీ. అది పక్కన పెట్టి టీకప్పు, కమోడ్ పింగాణీ అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. అసలింతకీ దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకుని మరీ లడ్డూ ప్రసాదంలో కలిపిన ఈ రసాయనం ఎలా తయారౌతుందని చూస్తూ.. ఈ రసాయనం తయారయ్యేదే జంతు కొవ్వు నుంచి. గతంలో ఎన్డీడీబీ రిపోర్టులో పంది కొవ్వు, జంతు కొవ్వు ఉన్నాయని నివేదిక రావడానికి కారణం ఇదే. పామాయిల్ లో బీటా కెరోటిన్ అనే ఎసిటిక్ యాసిడ్ వంటి కెమికల్స్ కలిపి.. దానికి ఈ కొరియన్ రసాయనానన్ని యాడ్ చేస్తే అది అచ్చం నెయ్యి రంగు, వాసన, చిక్కదనాలను సంతరించుకుంటుంది.
అంటే ఒక కొత్త నెయ్యి పదార్ధాన్ని కనిపెట్టారన్నమాట. చుక్క నెయ్యి వాడకుండా నెయ్యి తయారు చేయడం ఎలా? అన్న పరిశోధనలు చేయడం మాత్రమే కాకుండా ఆ పదార్థంతో లడ్డూ ప్రసాదం తయారు చేసి శ్రీవారి భక్తులకూ, శ్రీవారికీ కూడా పంగనామాలు పెట్టేశారు. ఇవేమీ చెప్పకుండా ఉండవల్లి ఉపమానాలతో ఉపమేయాలతో తిమ్మిని బమ్మిని చేయడానికి చేసిన ప్రయత్నంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. శ్రీవారి భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి.




.webp)


