సనాతన ధర్మంపై ఉదయనిథి స్టాలిన్ యూటర్న్?

posted on: May 16, 2026 10:49AM

తమిళనాడు మాజీ ఉపముఖ్యమంత్రి, ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో యూటర్న్ తీసుకున్నారా?  అన్న విషయంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  గతంలో సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన..  తాజాగా  తాను సమాజంలో కుల వివక్షకు మాత్రమే వ్యతిరేకమని, దేవాలయాలలో పూజా విధానాలు, ప్రజల మత స్వేచ్ఛకు తాను వ్యతిరేకంగా కాదనీ పేర్కొనడం ఈ చర్చకు దారి తీసింది. 

ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఓటమి పాలైనప్పటికీ.. ఉదయనిధి స్టాలిన్  తన పాత పంథాను వీడలేదు.   తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని రాష్ట్రం నుండి పూర్తిగా తుడిచిపెట్టాలనే డిమాండ్‌ను ఆయన మళ్లీ గట్టిగా వినిపించారు. అయితే..  ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై   తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. 

అలాగే తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) కూడా ఉదయనిథి స్టాలిన్ కు గట్టి రిటార్డ్ ఇచ్చింది. సనాతన ధర్మ నిర్మూలన అంటే   అర్థం ఏమిటో, దానిపై ఉదయనిథి స్టాలిన్ కు ఉన్న ఖచ్చితమైన అభిప్రాయం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. అధికార పక్షం నుండి ఊహించని విధంగా ఒత్తిడి రావడంతో ఉదయనిధి స్టాలిన్ డిఫెన్స్ లో పడ్డారు. టీవీకే డిమాండ్ పై స్పందించిన ఆయన తన స్వరం మార్చి..  తాను సమాజంలో ఉన్న అసమానతలకు, కుల వివక్షకు మాత్రమే వ్యతిరేకమన్నారు.  దేవాలయాల పూజా విధానాలపై కానీ, ప్రజల మత స్వేచ్ఛపై కానీ ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు. 

ఉదయనిధి స్టాలిన్ హఠాత్తుగా ఇలా యూటర్న్ తీసుకోవడంపై కూడా నెటిజనులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.  సనాతన ధర్మం పట్ల నిజంగానే ఆయనకు అంత మృదువైన అభిప్రాయం ఉంటే..  దానిని పూర్తిగా నిర్మూలించాలంటూ ఎందుకు  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని నిలదీస్తున్నారు.   రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన అప్పట్లో మాట్లాడారని దుమ్మెత్తి పోస్తున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...