బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట వాసి
posted on: Feb 12, 2026 4:02PM

తెలంగాణలో సాధారణ కుటుంబంలో పుట్టిన ఓ యువకుడు.. బ్రిటన్ పార్లమెంటులో అడుగు పెట్టి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్య పరిచారు. బ్రిటన్ పార్లమెంటు ఎగువ సభ అయిన 'హౌస్ ఆఫ్ లార్డ్స్'లో సభ్యుడిగా నిలిచి చరిత్ర సృష్టించారు. భగవద్గీతపై ప్రమాణం చేసి మరీ పదవీ బాధ్యతలు చేపట్టారు. సిద్దిపేట జిల్లాకు చెందిన ఉదయ్ నాగరాజు బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ అయిన ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’లో జీవితకాల సభ్యుడిగా నియమితులు అయ్యారు. బుధవారం (ఈ నెల 11న) లండన్‌లో జరిగిన ఈ చారిత్రాత్మక వేడుకలో ఆయన బ్రిటిష్ సంప్రదాయం ప్రకారం ముదురు ఎరుపు రంగు గౌను ధరించి.. భారతీయ మూలాలను స్మరిస్తూ భగవద్గీతపై ప్రమాణం చేశారు.
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన 46 ఏళ్ల ఉదయ్ నాగరాజు.. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అయితే ముందు నుంచీ చదువుపై అమితమైన ఆసక్తి ఉన్న ఈయన.. వరంగల్, హైదారాబాద్ వంటి ప్రాంతాల్లో విద్యను అభ్యసించారు. సుమారు 25 ఏళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లిన నాగరాజు.. లండన్ యూనివర్శిటీ కాలేజీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ పూర్తి చేశారు. ఆపై అక్కడే స్థిరపడి సామాజిక, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేశారు. రెండేళ్ల క్రితం జరిగిన బ్రిటిష్ పార్లమెంట్ ఎన్నికల్లో ఉదయ్ నాగరాజు నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ నియోజకవర్గం నుంచి లేబర్ పార్టీ తరఫున పోటీ చేశారు.
ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో విజయాన్ని చేజార్చుకున్నప్పటికీ.. ఆయన మేధస్సుకు, ప్రజా సేవకు ముగ్ధులైన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆయన పేరును ఎగువ సభకు సిఫార్సు చేశారు. దీనిని ఆమోదించిన కింగ్ చార్లెస్-3.. ఆయనను జీవితకాల సభ్యుడిగా నియమించారు. ఈక్రమంలోనే నాగరాజు బుధవారం నాడు భగవద్గీతపై ప్రమాణం చేసి మరీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈక్రమంలోనే బ్రిటన్ రాజ్యాంగ సంప్రదాయం ప్రకారం ఆయనకు 'బారోన్ నాగరాజు ఆఫ్ బ్లూమ్స్‌బరీ' అనే బిరుదును ఇచ్చారు. ఈ హోదా పొందిన అతి పిన్న వయస్కులైన భారతీయుల్లో ఉదయ్ నాగరాజు ఒకరు కావడం విశేషం. నాగరాజుకు కృత్రిమ మేధపై కూడా ఆయనకు అపారమైన పట్టు ఉంది. ‘ఏఐ పాలసీ ల్యాబ్స్’ సంస్థ ద్వారా కృత్రిమ మేధ, గ్లోబల్ గవర్నెన్స్ వంటి అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో ఆయన తన గళాన్ని వినిపిస్తున్నారు.






