Latest News
రీల్స్ మోజు.. ఉసురు కోల్పోయిన ఇద్దరు యువకులు
posted on: Mar 24, 2026 12:24PM
.webp)
రీల్స్ మోజులో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో రీల్స్ పోస్టు చేసి పాపులర్ అవ్వాలన్న మోజులో ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం పేర్నాడు గ్రామానికి చెందిన పాతికేళ్ల జడ సునీల్, అలాగే పిండిపాలెం గ్రామానికి చెందిన 24 ఏళ్ల డమాయి కళ్యాణ్ రైలుపట్టాలపై పడుకుని వీడియో తీస్తుండగా.. ఇదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన ఎక్స్ప్రెస్ రైలు ఢీకొనంది.
ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో డమాయి కల్యాణ్ కు నెలన్నర రోజుల కిందటే వివాహం అయ్యింది. చేతికి అంది వచ్చి అండగా నిలుస్తారనుకున్న కుమారులను పోగొట్టుకున్న వారి తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.
కాగా సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియా మోజు ఎంత ప్రమాదకరమో ఈ విషాద ఘటనతో మరోసారి రుజువైంది. ప్రాణాలకు ముప్పు కలిగించే స్టంట్లు, రీల్స్ కోసం చేసే ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని పోలీసులు, పెద్దలు యువతకు సూచిస్తున్నారు.






