అమరావతికి రెండు బుల్లెట్ ట్రైన్లు!
posted on: Feb 12, 2026 8:16AM

దేశ వ్యాప్తంగా ఏడు హైస్పీడ్ రైళ్ల కారిడార్లను కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ఏడు కారిడార్లలో మూడు తెలుగు రాష్ట్రాల గుండా వెడతాయి. హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్- చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్లు ఏపీ మీదుగా వెళ్లనున్నాయి. బెంగళూరు, చెన్నై వెళ్లే కారిడార్లు అమరావతి మీదుగా, చెన్నై-బెంగళూరు హైస్పీడ్ కారిడార్ చిత్తూరు మీదుగా వెళ్లనుంది. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ల రాకతో భవిష్యత్తుల్లో ఏపీ రూపురేకలు మారనున్నాయని అంటున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతికి కనెక్టివిటీ మరింత పెరగనుంది. కాగా తన హస్తిన పర్యటన సందర్భంగా విత్తమంత్రిని కలిసిన చంద్రబాబు.. బెంగళూరు-చెన్నై హైస్పీడ్ కారిడార్‌కు సంబంధించి చిత్తూరు-తిరుపతి మధ్య 75 కిలోమీటర్ల వ్యూహత్మక కనెక్టివిటీ ఇవ్వాలని కోరారు.
దీని వల్ల కనెక్టివిటీ బెంగళూరు-అమరావతి కారిడార్‌కు ఎంతో మేలు చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. దీని వల్ల అమరావతి, బెంగళూరు మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుందనీ, అలాగే, బెంగళూరు-అమరావతి మధ్య అదనంగా ఒక బుల్లెట్ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశముంటుందనీ తెలిపారు. చంద్రబాబు ప్రతిపాదన పట్ల విత్తమంత్రి సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ అమరావతి మీదుగా వెళ్లనుంది. దీంతో హైదరాబాద్ నుంచి అమరావతికి గంటలోపే చేరుకోవచ్చు.


.webp)



