రక్షణ క్షేత్రాలే లక్ష్యంగా జంట పేలుళ్లు!?

posted on: May 7, 2026 10:01AM

సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ లో ఒక్కసారిగా భద్రతా పరమైన ఉత్కంఠ నెలకొంది. కేవలం   గంటల వ్యవధిలో రెండు కీలకమైన రక్షణ స్థావరాల సమీపంలో పేలుళ్లు సంభవించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మంగళవారం(మే 5)  రాత్రి జలంధర్ లోని సరిహద్దు భద్రతా దళం  బీఎస్ఎఫ్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం వద్ద..  ఆపై అమృతసర్ లోని ఆర్మీ కాంటోన్మెంట్ సమీపంలో నూ ఈ పేలుళ్లు సంభవించాయి.   ఈ పేలుళ్ల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ..  అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే రక్షణ ప్రాంతాల్లోనే  పేలుళ్లు జరగడం భారత భద్రతా వ్యవస్థను ఆలోచనలో పడేసింది. ఈ ఘటనల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించి.. సరిహద్దు వెంబడి నిఘా  ముమ్మరం చేశారు.  తొలి ఘటన జలంధర్ లోని బీఎస్ఎఫ్ పంజాబ్ ఫ్రంటియర్ హెడ్ క్వార్టర్స్ ప్రధాన ద్వారం వద్ద చోటుచేసుకుంది. రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో అక్కడ నిలిపి ఉంచిన ఒక స్కూటర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ పేలుడు తీవ్రతకు ఆ వాహనం పూర్తిగా దగ్ధమవ్వడమే కాకుండా.. పరిసరాల్లోని భవనాల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. తొలుత ఇది కేవలం వాహన ప్రమాదంగా భావించినప్పటికీ..  ఫోరెన్సిక్ బృందాల తనిఖీలో అక్కడ పేలుడు పదార్థాల ఆనవాళ్లు లభించాయి.  

గురుప్రీత్ సింగ్ అనే డెలివరీ ఏజెంట్   తన వాహనం వద్దకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని విచారణలో తేలింది.  జలంధర్ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే.. అంటే మంగళవారం (మే 6)   రాత్రి  11 గంటల ప్రాంతంలో అమృతసర్ లోని ఖాసా ఆర్మీ కాంటోన్మెంట్ సరిహద్దు గోడ వద్ద మరో పేలుడు సంభవించింది.  గుర్తుతెలియని వ్యక్తులు గోడ అవతలి నుంచి పేలుడు పదార్థాన్ని లోపలికి విసిరినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఈ దాడిలో ఆర్మీ గోడకు ఉన్న టిన్ షీట్లు   దెబ్బతిన్నాయి. గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు సంఘటనలు యాదృచ్ఛికం కాదనీ..   పక్కా ప్రణాళిక ప్రకారం జరిగాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. 

 ఈ విధ్వంసకర చర్యలకు తామే బాధ్యులమంటూ  ఖలిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (కేఎల్ఏ) అనే ఉగ్రవాద సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం సంచలనంగా మారింది. తమ దాడులను  ఆపరేషన్ నవా సవేర్  గా పేర్కొంటూ..  భద్రతా దళాల ఉన్నతాధికారులే తమ లక్ష్యమని   హెచ్చరించింది. అయితే ఈ పోస్టుల విశ్వసనీయతను పోలీసులు   నిర్ధారించాల్సి ఉంది. దీని వెనుక పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ (ఐఎస్ఐ) మద్దతుతో పనిచేసే గ్యాంగ్ స్టర్ల హస్తం ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. భవిష్యత్తులో పెద్ద ఎత్తున దాడులు చేయడానికి ఉగ్రవాదులు చేస్తున్న  డ్రై రన్  గా ఈ  పేలుళ్లను పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, పూంచ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన  ఆపరేషన్ సిందూర్  ప్రథమ వార్షికోత్సవానికి ఒకరోజు ముందు ఈ పేలుళ్లు జరిగాయి. 2  ఆ సంఘటనకు గుర్తుగా, ఒక రకమైన మానసిక యుద్ధం చేసే ఉద్దేశంతోనే ఉగ్రమూకలు ఈ సమయాన్ని ఎంచుకున్నట్లు భద్రతా వర్గాలు అంటున్నాయి. 

 గతంలో పటియాలా రైల్వే ట్రాక్ వద్ద జరిగిన పేలుడు ప్రయత్నాలను కూడా దృష్టిలో ఉంచుకుని..  పంజాబ్ లో అశాంతి రేకెత్తించేందుకు జరుగుతున్న కుట్రలను ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది.  ప్రస్తుతం ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ  చేపట్టింది.  స్థానిక పోలీసులతో కలిసి ఎన్ఐఏ అధికారులు పేలుడుకు వాడిన పదార్థాల స్వభావాన్ని, సోషల్ మీడియా పోస్టుల డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా రికార్డుల ద్వారా నిందితుల కోసం వేట కొనసాగుతోంది. స్కూటర్ యజమానిని కూడా విచారిస్తూ, ఈ రెండు పేలుళ్లకు మధ్య ఉన్న లింకులను ఛేదించే పనిలో ఉన్నారు. ఇది కేవలం ఒక నేరపూరిత చర్య మాత్రమే కాదని, దీని వెనుక విదేశీ శక్తుల ఆర్థిక, వ్యూహాత్మక మద్దతు ఉందన్న అనుమానాలు  బలంగా వ్యక్తమౌతున్నాయి.  ఈ పేలుళ్లు పంజాబ్ రాజకీయాల్లో  వేడిని పెంచాయి. రాష్ట్రంలోని ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ, అకాలీదళ్   ప్రస్తుత ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. నిఘా వైఫల్యం వల్లే రక్షణ స్థావరాలకు ముప్పు ఏర్పడిందని ఆరోపిస్తున్నాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం, శాంతిభద్రతలను కాపాడటంలో రాజీ పడేది లేదని, ఇలాంటి సంఘటనలను రాజకీయ కోణంలో చూడవద్దని కోరింది. 

వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ తరహా భద్రతా లోపాలు రాజకీయ వాదోపవాదాలకు కేంద్రబిందువుగా మారే అవకాశం ఉంది.  భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సరిహద్దుల వద్ద టెక్నాలజీ ఆధారిత నిఘాను పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. డ్రోన్లు, అధునాతన సెన్సార్ నెట్ వర్క్ లు,  డిజిటల్ ఫోరెన్సిక్స్ ద్వారా ఉగ్రవాదుల కుట్రలను పసిగట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. అలాగే  ప్రజల్లో అవగాహన పెంచి, అనుమానాస్పద వ్యక్తుల గురించి సమాచారం ఇచ్చేలా వారిని ప్రోత్సహించడం కూడా కీలకం. పంజాబ్ శాంతిని భగ్నం చేయాలని చూస్తున్న శక్తులకు గట్టి బుద్ధి చెప్పాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యంత ఆవశ్యకం. 

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ నచ్చినట్లైతే https://www.teluguone.comను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...