ఇంకా ఎంతకాలం ఆ రెండు ఛానళ్ళపై నిషేధం?

 

గత మూడు నెలలుగా తెలంగాణాలో ఆంధ్రజ్యోతి, టీవీ-9 ఛాన్నళ్లపై నిషేధం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ఇతర మీడియా, హైకోర్టు అన్నీ కూడా నిషేధాన్ని ఎత్తివేయమని కోరిణా ఫలితం లేకపోయింది. చివరికి కేంద్ర సంచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలంగాణా యం.యస్.ఓ.లకు ఇచ్చిన వారం రోజుల గడువు పూర్తయ్యి పదిహేను రోజులవుతోంది. కానీ ఆ రెండు న్యూస్ చానళ్ళపై నేటికీ నిషేధం కొనసాగుతూనే ఉంది. అందరి ఖండనల తంతు పూర్తయిపోయింది. తెలంగాణా కాంగ్రెస్ మేధోమధన సదస్సుకు విచ్చేసిన దిగ్విజయ్ సింగ్ కూడా పనిలోపనిగా మీడియాపై నిషేధాన్ని ఖండించి పడేసి, వాటికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించి చేతులు దులుపుకొన్నారు. అయితే కేంద్రమంత్రి జవదేకర్ హెచ్చరికలనే బేఖాతరు చేసిన తెలంగాణా యం.యస్.ఓ.లు, కేంద్రంలో, రెండు రాష్ట్రాలలో కూడా అధికారం కోల్పోయి ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తులను పట్టించుకొంటారను కోవడం అత్యాశే అవుతుంది. కానీ ఈ పరిస్థితి చూస్తుంటే ఆ నిషేధం శాశ్వితమయ్యేలా ఉంది. మీడియాపై ఇటువంటి నిషేధం ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదు.