Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ట్రంప్ ప్రకటనలు.. వాస్తవ పరిస్థితులు.. మళ్లీ చమురు మంట?
posted on: Apr 29, 2026 3:21PM
.webp)
అంతర్జాతీయ చమురు విపణిలో మరో భారీ కుదుపునకు రంగం సిద్ధమవుతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా వ్యవస్థలు ఒత్తిడికి లోనవుతుండగా.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న సోషల్ మీడియా పోస్టులు ఈ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయని ఇంధన రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం విపణిలో కనిపిస్తున్న ప్రశాంతత కేవలం తుపాను ముందు నిశ్శబ్దం మాత్రమేననీ.. త్వరలోనే సామాన్యుడి జేబుకు చిల్లు పడేలా గ్యాసోలిన్ ధరలు పెరగనున్నాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందనీ, అమెరికా చమురు ఉత్పత్తి పెరగడం వల్ల ధరలు తగ్గుతాయని పదేపదే ప్రకటిస్తున్నారు. దీనివల్ల విపణిలో పేపర్ ప్రైస్ కొంత మేర నియంత్రణలో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాస్తవ సరఫరా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఫ్యూచర్స్ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 100డాలర్ల వద్ద ఉన్నప్పటికీ.. తక్షణమే కొనుగోలు చేయాలంటే 140 డాలర్ల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ వ్యత్యాసం మున్ముందు రాబోయే భారీ ధరల పెరుగుదలకు సంకేతమని పికరింగ్ ఎనర్జీ పార్టనర్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ డాన్ పికరింగ్ విశ్లేషించారు.
రాబోయే వేసవి డ్రైవింగ్ సీజన్ ప్రారంభమయ్యే సమయానికి ప్రజలకు ధరల పెరుగుదల అనే షాక్ బలంగా తగలనుంది. స్టాక్ మార్కెట్ ప్రస్తుతం ఈ ముప్పును విస్మరిస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసివేత ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారింది. ఇరాన్ శాంతి ప్రతిపాదనలను అమెరికా పరిశీలిస్తున్నప్పటికీ, ఆచరణలో మార్కెట్ స్థిరపడటం లేదు. ఒకవేళ జూన్ వరకు ఈ జలసంధి మూసివేత కొనసాగితే.. బ్యారెల్ చమురు ధర 150డాలర్ల మార్కును చేరుకుంటుందని సిటీ గ్రూప్ అంచనా వేసింది.
ఆసియా, ఐరోపా దేశాల్లో చమురు నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. రాపిడన్ ఎనర్జీ గ్రూప్ నివేదిక ప్రకారం ఆసియా దేశాల్లో చమురు నిల్వలు ఆపరేషనల్ మినిమమ్ అంటే కనీస స్థాయికి పడిపోయాయి. ముడి చమురు దొరక్కపోవడంతో ప్రపంచవ్యాప్తంగా రిఫైనరీలు తమ కార్యకలాపాలను తగ్గించుకుంటున్నాయి. వేసవిలో డిమాండ్ పెరుగుతుండటం వల్ల సరఫరా, డిమాండ్ మధ్య అంతరం మరింత పెరగనుంది.
అమెరికా అధ్యక్షుడి ప్రకటనల వల్ల అమెరికాలోని చమురు ఉత్పత్తిదారులు గందరగోళానికి గురవు తున్నారు. యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ప్రభుత్వం ప్రకటిస్తుండటంతో.. కొత్తగా నిధులు వెచ్చించి ఉత్పత్తిని పెంచడానికి కంపెనీలు వెనుకాడతున్నాయి. డిఫెన్స్ ప్రయారిటీస్ థింక్ ట్యాంక్ డైరెక్టర్ రోజ్మేరీ కెలానిక్ అభిప్రాయం ప్రకారం.. ఈ కాలయాపన వల్ల ధరల పెరుగుదల అనివార్యమైనప్పుడు దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. అమెరికా చమురు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ ధరల పెరుగుదల ప్రభావం నుండి తప్పించుకోలేదు. కేవలం గ్యాసోలిన్ ధరలు పెరగడమే కాకుండా.. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకనున్నాయి. ఇది ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని మరింత పెంచుతుంది. డీజిల్ ధరలు పెరిగితే షిప్పింగ్ ఖరీదవుతుంది, ట్రక్కింగ్ ఖరీదవుతుంది. ఫలితంగా మీరు స్టోర్లో కొనే ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. రాబోయే కొన్ని నెలలు ఇంధన విపణికి అత్యంత కీలకం. యుద్ధ వాతావరణం సద్దుమణిగి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ తెరుచుకుంటే తప్ప, ధరల భారం నుండి ఉపశమనం లభించే అవకాశం లేదు. అప్పటివరకు వినియోగదారులు 'పెట్రో భారం' మోయక తప్పదని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.
-సీతారాం కంఠంనేని
References
Citigroup Global Commodities Forecast (2026).
JPMorgan Investment Note on Global Inventories (Natasha Kaneva).
Rapidan Energy Group Crude Market Analysis (Jenna Delaney).
Pickering Energy Partners Market Outlook.
White House Official Statements and Truth Social Posts (April 2026)
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే తెలుగువన్ ను ఫాలో అవ్వండి, షేర్ చేయండి






