టర్కీ సైనిక "కుట్ర" వెనుక అమెరికా..?

posted on: Jul 18, 2016 1:14PM

దేశంలో నియంతృత్వ పాలన, పెరుగుతున్న ఉగ్రవాదాన్ని సాకుగా చూపుతూ టర్కీ సైనికులు ఆ దేశ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తిరుగుబాటు చేశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోయాలని చూసిన టర్కీ సైన్యం కుట్రను ప్రభుత్వ అనుకూల దళాలు, ప్రజలు కలిసి విఫలం చేశారు. సైనిక కుట్ర విఫలమైన తర్వాత ఆ దేశ ప్రభుత్వం కుట్రదారులపై ఉక్కుపాదం మోపుతోంది. అలాగే కుట్ర వెనుక కారణాలను, సూత్రధారులను బయటకు లాగే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఈ కుట్ర వెనుక అమెరికా ఉందంటూ టర్కీ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రపంచం ఉలిక్కిపడింది. తిరుగుబాటులో అమెరికా పాత్రపై టర్కీ కార్మికశాఖ మంత్రి అనుమానించారు. అందుకు కారణాలు లేకపోలేదు..

 

అమెరికాలో నివసిస్తున్న టర్కీ అసమ్మతి నేత "ఫెతుల్లా గులెన్" అనుచరులే అరెస్టయిన వారిలో ఎక్కువ మంది ఉన్నారు. సున్నీ ముస్లిం నేత సయ్యద్ నుర్సీ శిష్యుడైన గులెన్ "హిజ్మత్" పేరిట ఓ ఉద్యమాన్ని నిర్వహిస్తూ, ఇస్లాం ప్రబోధకుడిగా ఉన్నారు. 2013 వరకూ ఎర్డోగాన్ సన్నిహితుడిగానే ఉన్న గులెన్, ఆపై అధ్యక్షుడిపై వచ్చిన అవినీతి ఆరోపణలతో దూరం జరిగారు. దేశాన్ని వదిలి అమెరికాలోని పెన్సిల్వేనియా పరిధిలోని పెకనాస్ పర్వత ప్రాంతంలో గ్రీన్ కార్డుతో నివసిస్తున్నాడు. సైనిక తిరుగుబాటు జరిగిన తర్వాత కారణాలు అన్వేషిస్తున్న అధ్యక్షుడు ఎర్డోగాన్ కూడా తిరుగుబాటుకు సూత్రధారిగా గులెన్‌ అని భావిస్తున్నారు. దీంతో ఆయన్ను తమ దేశానికి అప్పగించాల్సిందిగా ఎర్డోగాన్ డిమాండ్ చేశారు. అయితే కుట్రపై గులెన్ ప్రమేయంపై సరైన ఆధారాలు చూపిస్తేనే ఆయన్ను టర్కీకి అప్పగిస్తామని యూఎస్ స్పష్టం చేసింది.

 

దీంతో పాటు సిరియాలోని ఐఎస్ఐఎస్‌పై దాడులకు అమెరికా ఉపయోగిస్తున్న టర్కీ వైమానిక స్ధావరంలోని జనరల్, 12 మంది అధికారులు ప్రభుత్వం కూల్చివేత కుట్రలో కీలక పాత్రధారులని తేలింది. తిరుగుబాటు దారులు వినియోగించిన విమానాలకు ఈ స్థావరంలోనే ఇంధనాన్ని సమకూర్చారు. ఈ ఆధారాలతో టర్కీ అమెరికాను అనుమానిస్తోంది. నిజానికి టర్కీ అమెరికాకు చిరకాల మిత్రదేశం. ప్రచ్ఛన్న యుద్ద సమయంలో టర్కీ, సోవియట్ రష్యా ప్రాబల్యాన్ని నిరోధించి అమెరికా కూటమిలో పనిచేసింది. అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో 1952 నుంచి సభ్యదేశంగా ఉంది. సిరియాలో ఐఎస్ఐఎస్‌ ఉగ్రవాదులపై అగ్రరాజ్యం చేస్తున్న పోరాటానికి మద్ధతుగా నిలిచి అమెరికాకు సహకరిస్తోంది. అలాంటి టర్కీ-అమెరికా సంబంధాలపై సైనిక తిరుగుబాటు పెను ప్రభావాన్ని చూపే అవకాశం కనిపిస్తోంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...