రాక్షసత్వానికి సరికొత్త వికృత నిర్వచనం ఇచ్చిన ఐసిస్!

posted on: Aug 22, 2016 4:34PM


ప్రేమలో , యుద్ధంలో ఏదీ తప్పు కాదంటారు! ప్రేమ సంగతి దెవుడెరుగు. యుద్ధంలో మాత్రం ఏదీ తప్పు కాదన్న కర్కోటక సత్యం ఐసిస్ సంస్థ బలంగా నమ్ముతుంది. అందుకు ఎన్నో ఉదాహరణలు. పబ్లిగ్గా తలలు నరకటం మొదలు ఇంకా పసితనం వాడని అమ్మాయిల్ని వేలానికి అమ్మటం వరకూ వాళ్లు చేయని దారుణం లేదు. ఇప్పుడు తమ వికృత చర్యల్ని వారికి వారే అధిగమించారు. టర్కీలో తాజా మానవబాంబు పేలుడుతో ఐఎస్ఐఎస్ రాక్షసత్వం కొత్త ఎత్తులకు చేరుకుంది...

 

యూరప్ ఖండంలోని ఏకైక ఇస్లామిక్ దేశం టర్కీ. ఐఎస్ ఉన్మాదంతో కకావికలైపోయిన సిరియాకి ఈ దేశంతో సరిహద్దు వుంది. అక్కడ్నుంచి టర్కీలోకి ఇబ్బడిముబ్బడిగా శరణార్థులు వస్తున్నారు. వాళ్ల ముసుగులోనే ఐసిస్ ఉగ్రవాదులు కూడా దేశంలో చొరబడుతున్నారు. అయితే, ఈ ఉగ్రవాదుల్ని గుర్తించటం టర్కీ పోలీసులకి, రక్షణ బలగాలకి అస్సలు కావటం లేదు. ఈ సంవత్సరం ఏకంగా రాజధాని ఇస్తాంబుల్ లోనే వరుస బాంబులు పేలుతున్నాయి. మొన్నా మధ్య దేశాధ్యక్షుడ్ని దించేసేందుకు ఆర్మీలో కుట్ర కూడా జరిగింది. ఇన్నిటి మధ్య టర్కీ పాలిట ఐసిస్ రాక్షసత్వం శనివారం నాడు కొత్త హద్దులు దాటింది...

 

సిరియా సరిహద్దు ప్రాంతంలోని టర్కీలో జరుగుతోన్న ఓ పెళ్లి వేడుకల్లో పెద్ద బాంబు పేలింది. అది ఓ మానవ బాంబు. మొత్తం 50మందికి పైగానే పొట్టన పెట్టుకున్నాడు తనని తాను పేల్చుకున్న ఐఎస్ ఉగ్రవాది. కాని, తరువాత అందర్నీ విభ్రాంతికి గురి చేసింది బాంబు పేలుడు కాదు. సదరు మానవ బాంబు వయస్సు! తనని తాను పేల్చుకున్న ఉగ్రవాది కేవలం 12సంవత్సరాల వయస్సు వాడై వుంటాడని టర్కీ అధ్యక్షుడు చెప్పాడు! ఉగ్రవాద దాడుల చరిత్రలోనే ఇంతలా 12ఏళ్ల పసివాడ్ని కూడా వాడుకున్న దాఖలాలు మనకు ఎక్కడా కనపడవు. మొత్తం ప్రపంచాన్ని రక్తం పీల్చే పిశాచిలా వేధిస్తున్న ఐసిస్ ఆ పని చేసేసింది. ముందు ముందు ఈ అరాచక ఉన్మాద సంస్థ ఇంకేం చేస్తుందో...  

 

google-ad-img
    Related Sigment News
    • Loading...