తుమ్మల పార్టీ మారేది డౌటే?

 

ఖమ్మం జిల్లాకి చెందిన తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు త్వరలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నారన్న వార్తలు రాజకీయ వర్గాలలో బాగా వ్యాపించి వున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని గత కొన్ని నెలల నుంచి పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడా పుకార్లు తీవ్రమయ్యాయి. ఖమ్మం జిల్లాలో అయితే తుమ్మల టీఆర్ఎస్‌లో చేరడం ఖాయమన్నట్టుగా ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. ఖమ్మం జిల్లాలో మరో తెలుగుదేశం నాయకుడు నామా నాగేశ్వరరావుతో వచ్చిన విభేదాల కారణంగా తుమ్మల టీడీపీని వీడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విభేదాల కారణంగానే గత ఎన్నికలలో ఇద్దరు నాయకులూ ఓడిపోయారన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. అయితే పార్టీ మారాలన్న ఉద్దేశం గతంలో తుమ్మలలో ఉన్నప్పటికీ, ఇప్పుడు మాత్రం ఆయన పార్టీ మారే ఉద్దేశాన్ని విరమించుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 

తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. ఆయన ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆయన అనారోగ్యానికి గురైయ్యారన్న వార్తను తెలుసుకుని ముందుగా స్పందించింది తెలుగుదేశం పార్టీనే. సాంకేతికంగా తుమ్మల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ, తెలుగుదేశం పార్టీలో ఆయనతో సన్నిహితంగా వుండే ఆంధ్రప్రదేశ్ నాయకులు వెంటనే స్పందించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.ఇ. కృష్ణమూర్తి మొదట ఆస్పత్రికి వెళ్ళి తుమ్మలను పరామర్శించారు. ఆ స్పత్రిలో తుమ్మలతో చాలాసేపు గడిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆస్పత్రికి వెళ్ళి తుమ్మలను పరామర్శించడంతోపాటు ఆయనకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ కూడా తుమ్మలను పరామర్శించారు. ఇంకా పలువురు నాయకులు తుమ్మల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇవన్నీ తుమ్మలలో కొంత మార్పును తెచ్చినట్టుగా తెలుస్తోంది. తాను పార్టీ మారబోతున్నానని తెలిసినప్పటికీ తనను తమ మనిషిలా భావిస్తూ పరామర్శిస్తున్న తెలుగుదేశం నాయకుల తీరు ఆయన్ని కదిలించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారే విషయాన్ని పునరాలోచిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.