Latest News

తెరాసలోకి వెళ్లేందుకు తుమ్మల రెడీ?

posted on: Aug 23, 2014 4:37PM

 

తెరాసలోకి వెళ్లేందుకు ఊగిసలాడుతున్న ఖమ్మం జిల్లా సీనియర్ తెదేపా నేత తుమ్మలనాగేశ్వర రావు, అందుకు రంగం సిద్దం చేసుకొన్నట్లు కనబడుతోంది. ఈరోజు జిల్లాలో సత్తుపల్లి ఊళ్ళో ఆయనను తెరాసలోకి ఆహ్వానిస్తూ పోస్టర్లు వెలిసాయి. అవి తెరాస కార్యకర్తలు పెట్టిన పోస్టర్లే అయినప్పటికీ, ఆయన సమ్మతి లేనిదే పోస్టర్లు వెలుస్తాయా? వెలిస్తే వాటిని వెంటనే తొలగించేందుకు లేదా ఆ చర్యలను ఖండించకుండా ఎందుకు ఉన్నారనే ప్రశ్న తలెత్తుతుంది. కొద్దిరోజుల క్రితం తెదేపా నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, మండవ వెంకటేశ్వరరావు ఆయనను వద్దకు చంద్రబాబు నాయుడు తరపున రాయబారం చేసినప్పుడు, ఆయన పార్టీలో తనకెదురవుతున్న సమస్యల గురించి చెప్పి తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. పార్టీని వీడబోనని ఆయన ఖచ్చితంగా హామీ ఇవ్వలేదు కానీ ఇప్పట్లో పార్టీని వీడబోనని చెప్పడం గమనిస్తే, ఆయన త్వరలోనే పార్టీని వీడి తెరాసలో చేరేందుకు నిర్ణయించుకొన్నట్లే స్పష్టం అవుతోంది. బహుశః ఆ కారణంగానే ఈరోజు ఆయనను తెరాసలోకి ఆహ్వానిస్తూ సత్తుపల్లిలో పోస్టర్లు వెలిసి ఉండవచ్చును. తాజా సమాచారం ఏమిటంటే ఆయన ఈరోజు ఉదయం అనారోగ్యానికి గురవడంతో హైదరాబాదులో గల యశోదా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తెదేపా నేతలు కే.ఈ. కృష్ణ మూర్తి తదితరులు ఆయనను పరామర్శించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...