సిట్ ఎదుటకు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి!
posted on Nov 11, 2025 11:44AM

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి మంగళవారం (నవంబర్ 11) సీట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అలిపిరి వద్దనున్న సిట్ కార్యాలయానికి వచ్చిన ధర్మారెడ్డిని సిట్ డీఐజీ మురళీ లాంబ విచారించారు. కాగా ఈ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారరెడ్డిని కూడా సిట్ విచారణకు హాజరు కావాల్సిందిగా ఆన్ లైన్ లో నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల మేరకు ఈ నెల 13న అంటే గురువారం వైవీసుబ్బారెడ్డి సిట్ ఎదుట హాజరు కావాల్సి ఉంది.
అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున ఆ రోజు విచారణకు హాజరు కాలేనంటూ వైవీసుబ్బారెడ్డి సిట్ కు సమాచారం అందించినట్లు తెలుస్తున్నది. సిట్ ఎదుట విచారణకు హాజరు అయ్యేందుకు తనకు వారం రోజుల వ్యవధి కావాలని వైవీసుబ్బారెడ్డి కోరినట్లు తెలుస్తున్నది. ఇలా ఉండగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి వ్యవహారంలో సిట్ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది. వారిలో కొందరు బెయిలుపై విడుదలయ్యారు కూడా.
ఇలా ఉండగా సిట్ ఇప్పటికే లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి పాత్రపై అనుమానాలున్నాయని పేర్కొంటూ సిట్ హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే సిట్ ఆయనను విచారణకు రావాల్సిందిగా సమాచారం ఇవ్వడం, అందుకు ఆయన మరింత గడువు కోరాలని అడగడం ప్రాధ్యాన్యత సంతరించుకున్నాయి.