టీటీడీ కొత్త ఛైర్మన్ ఆయనే..పాపం రాయపాటి పరిస్థితి ఏంటీ..?

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక కేంద్రం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలకు ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. మరి అంతటి భక్త కోటి యోగ క్షేమాలు చూసుకోవడానికి ఎంత పెద్ద వ్యవస్థ ఉండాలి. దాని పేరే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంక్షిప్తంగా టీటీడీ. సుమారు 10 వేల మందికి పైగా ఉద్యోగులతో చిన్న సైజు ప్రభుత్వంలా ఉండే టీటీడీకి ఛైర్మనే అధిపతి. ఆ పదవి కోసం నాటి నుంచి నేటి వరకు ఎన్నో పైరవీలు, లాబీయింగ్‌లు కానీ ఎవరో ఒక్కరినే ఆ అదృష్టం వరిస్తుంది. ప్రస్తుత ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పదవి కాలం ముగియనుండటంతో తమకు అవకాశం ఇవ్వాలంటూ ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా...ఎవరికి అందనంత ఎత్తులో ఆలోచిస్తుంటారు సీఎం చంద్రబాబు నాయుడు.

 

అందుకు అనుగుణంగా ఈ సారి రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తికి ఛైర్మన్‌గా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి. ఇందులో భాగంగా తనకు అత్యంత సన్నిహితుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డా. కె లక్ష్మీనారాయణను ఛైర్మన్‌గా నియమించేందుకు దాదాపుగా రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ వార్త తెలిసినప్పటి నుంచి మిగిలిన వారి సంగతి ఏమో కానీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మాత్రం తీవ్ర నిరాశలో కూరుకుపోయారట. టీటీడీ ఛైర్మన్‌ పదవి ఆయన చిరకాల కోరిక. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయన రెండు సార్లు ఛైర్మన్ గిరి కోసం ప్రయత్నించినప్పటికి ఆయనకు మొండిచేయి ఎదురైంది. అయితే ఎంపీ, లేదా ఎమ్మెల్యేగా ఉన్నవారికి ఈ పదవిని ఇవ్వకూడదని సీఎం నిర్ణయించుకోవడంతో అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సైతం రాయపాటి సిద్ధమయ్యారు.

 

కానీ అనూహ్యంగా లక్ష్మీనారాయణ పేరు తెర మీదకు రావడంతో రాయపాటి షాక్‌కు గురయ్యారు. ఇక లక్ష్మీనారాయణ విషయానికి వస్తే ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన విశేషమైన సేవలందించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. పదవి విరమణకు ముందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేశారు.