తిరుమలలో భక్తుల రద్దీ
posted on Nov 9, 2025 9:45AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నాయి. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) శ్రీవారిని 80,560 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,195 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.22 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ముఖేశ్ అంబానీకి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు శాలువా కప్పి వేదాశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.