ట్రంప్ యు టర్న్.. హస్తానికి బిగ్ షాక్!

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే..  ఉభయ దేశాలను అదిరించి, బెదిరించి దారికి తెచ్చింది నేనే..  కాల్పుల విరమణ చేయించింది నేనే... అంటూ పదే పదే ప్రకటించిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు  డోనాల్డ్ ట్రంప్ ఒక్క సారిగా యు  టర్న్ తీసుకున్నారు.  నేనే ..నేనే అంటూ ఒకటికి 14 సార్లు, ప్రపంచం ఇల్లెక్కి చెప్పిన ట్రంప్ , చివరాఖరుకు భారత్ – పాక్ కాల్పుల విరమణ విషయంలో తన పాత్ర,  ప్రమేయం ఇసుమంతైనా లేదని బహిరంగంగా ఒప్పుకున్నారు. 

అదికూడా..  ట్రంప్’ ప్రగాల్బాలపై ప్రధాని మోదీ నేరుగా స్పందించి 24 గంటలు గడవక ముందే  ఆయన  ‘యు’ టర్న్ తీసుకున్నారు. కాగా, డొనాల్డ్ ట్రంప్ ప్రకనటపై తొలి సారి స్పందించిన ప్రధాని మోదీ కాల్పుల విరమణలో అమెరికా ప్రమేయం లేదని    బుధవారం (మార్చి 18) తేల్చి చెప్పారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. నిజానికి , ట్రంప్ చేసిన  నేనే..నేనే..  ప్రగల్బ ప్రకటనలకు  భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ, భారత సైన్యం ఎప్పుడోనే  సమా ధానం ఇచ్చింది. అయినా..   ట్రంప్  అదే పాట పాడుతూ..  కాల్పుల విరమణ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆయన సంగతి అలా ఉంటే మరో వంక మన దేశంలో విపక్షాలు ముఖ్యంగా రాహుల్ గాంధీ,  కాంగ్రెస్ నాయకులు మోదీ మౌనాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. రాహుల్ గాంధీ అయితే.. మరో అడుగు ముందుకేసి,  ట్రంప్ ఆదేశాలకు ప్రధాని మోదీ లొంగి పోయారని, అందుకే వైట్ హౌస్ నుంచి ఫోన్  రాగానే  కాల్పుల విరమణకు అంగీకరించారనే అర్థంవచ్చేలా.. ‘నరేందర్ .. సరెండర్’  అంటూ ప్రధాని మోదీని ఎగతాళి చేశారు. 

కాగా..  తాజగా పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్‌కు, వైట్ హౌస్ లో ఇచ్చిన విందు సందర్భంగా.. భారత్ – పాక్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో తమ పాత్ర లేదని  ట్రంప్ తేల్చి చెప్పారు.  విందు అనంతరం ఓవల్ ఆఫీస్‌లో మునీర్ తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ అసలు నిజం వెల్లడించారు. భారత్-పాకిస్థాన్ అధినేతలు యుద్ధాన్ని కొనసాగించకూడదని తెలివైన నిర్ణయం తీసుకున్నారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం మంచిది కాదు అని ట్రంప్ పేర్కొన్నారు.ఇలా..  ట్రంప్ కాల్పుల విరమణలో తమ ప్రమేయం లేదని చెప్పడం ఇదే తొలిసారి కావడం విశేషం అంటున్నారు. 

దీంతో.. ఇంచుమించుగా నెల రోజులకు పైగా ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ  ప్రశ్నిస్తూ వచ్చిన రాహుల్, కాంగ్రెస్ నాయకులు ఎలా స్పందిస్తారో చూడవలసి వుందని పరిశీలకులు  అంటున్నారు. నిజానికి పహల్గాం ఉగ్రదాడి తదనంతర పరిణామాలు.. మరీ ముఖ్యంగా, ఆపరేషన్ సింధూర్ పర్యవసానంగా తలెత్తిన ఉద్రిక్తల విషయంగా, అలాగే పాకిస్థాన్ సాగిస్తున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతు కూడా గట్టేందుకు, ఎంపీ బృందాల వివిధ దేశాలతో జరిపిన దౌత్య పర్యటనల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు ఒకటొకటిగా తేలిపోతున్ననేపధ్యంలో ట్రంప్  ‘యు’ టర్న్.. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అవుతుందని అంటున్నారు.