డాలర్ కాయిన్ పై ట్రంప్ ముఖం.!

posted on: Jul 16, 2026 2:32PM

ప్రపంచ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద  నేతగా గుర్తింపు పొందిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి  వార్తల్లో నిలిచారు. తనదైన శైలి నిర్ణయాలతో  నిత్యం చర్చల్లో ఉండే ట్రంప్..  తాజాగా యూఎస్ కరెన్సీపై తన బొమ్మ ముద్రణతో మరో సారి టాక్ ఆప్ ది వరల్డ్ గా మారారు.  అమెరికా స్వాతంత్ర్యం 250 వసంతాలు పూర్తి చేసుకుంటున్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని..  ప్రెసిడెంట్ ట్రంప్ ముఖచిత్రంతో కూడిన సరికొత్త నాణేన్ని అక్కడి ప్రభుత్వం తీసుకువస్తోంది. దీనికి సంబంధించిన  ఫస్ట్ లుక్  సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో   హల్ చల్ చేస్తోంది.  

అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం  యునైటెడ్ స్టేట్స్ మింట్   1 డాలర్  విలువైన గోల్డ్ కాయిన్ తయారీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ నాణెంపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చిత్రం స్పష్టంగా ముద్రించబడి ఉంది. దేశానికి సంబంధించిన కీలకమైన స్వాతంత్ర్య వారసత్వాన్ని, దేశభక్తిని ప్రతిబింబించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అమెరికా విలువలను, దేశ బలాన్ని చాటిచెప్పడంతో పాటు ప్రజలందరికీ స్వేచ్ఛను రక్షించేలా దేశం కట్టుబడి ఉందనే సందేశాన్ని ఈ నాణెం ఇస్తుందని యూఎస్ సెక్రటరీ బెస్సెంట్  పేర్కొన్నారు. 

  అమెరికా చరిత్రలోనే ఒక అధ్యక్షుడు అధికారంలో ఉంటూ, జీవించి ఉన్న సమయంలోనే దేశ అధికారిక కరెన్సీపై ఆయన చిత్రం ముద్రించబడటం ఇదే తొలిసారి. సాధారణంగా దేశాల కరెన్సీ నోట్లు లేదా నాణేలపై చారిత్రక పురుషులు, దివంగత నేతల చిత్రాలను ముద్రించడం ఆనవాయితీయే.   కానీ ట్రంప్ విషయంలో ఈ సంప్రదాయానికి భిన్నంగా, ఆయన సజీవంగా ఉండగానే యూఎస్ కరెన్సీపై స్థానం సంపాదించడం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ మేధావులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. తనను తాను ఒక అసాధారణమైన లార్జర్-దెన్-లైఫ్ వ్యక్తిత్వంగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడే ట్రంప్ శైలికి ఇది నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ సరికొత్త  డాలర్ గోల్డ్ నాణెం మార్కెట్లోకి విడుదలైన తర్వాత అమెరికా ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

Donald Trump Gold Coin, US Mint 1 Dollar Coin, US 250 Years Independence, America President Trump Currency

google-ad-img
    Related Sigment News
    • Loading...