నిజ‌మైన విలాస‌వంత‌మైన జీవిత‌ం.. ఇండియాలోనే, విదేశాల్లోనా?

posted on: Jun 19, 2026 8:35AM

అమెరికా ఆరోగ్య వ్యవస్థ ఒకే కేంద్ర పాలిత వ్యవస్థ కాదు. అది ప్రైవేట్ ఇన్సూరెన్స్, ఎంప్లాయ‌ర్ బేస్డ్ క‌వ‌రేజ్, మెడికేర్, మెడిసైడ్.. అంతే  కాదు రాష్ట్రాల ఆధారిత నియ‌మాల మిశ్ర‌మంగా ఉంటుంది. దీని కార‌ణంగా.. స్పెష‌లిస్ట్ యాక్సెస్, డ్ర‌గ్ ప్రైజింగ్, ప్ర‌య‌ర్ ఆథ‌రైజేష‌న్ వంటి అంశాలు దేశ‌మంత‌టా  ఒకేలా ఉండ‌వు. కానీ, ఆల‌స్యం.. ఖ‌ర్చు స‌మ‌స్య‌లు మాత్రం వ్య‌వ‌స్థాగ‌తంగా చాలా పెద్ద‌విగానే క‌నిపిస్తాయి.

భారతదేశంలో మాత్రం అనేక మందులు తక్కువ నియంత్రణ. అడ్డంకులతో లభిస్తాయి. జ‌న‌రిక్ మార్కెట్ విస్తృతి, లోక‌ల్ మాన్యుఫ‌క్చ‌రింగ్, త‌క్కువ ధ‌ర‌ల విధానం వ‌ల్ల కొన్ని సాధార‌ణ  మందులు ఇక్క‌డ  చాలా  చాలా చౌక‌గానే  దొరుకుతాయి. అమెరికాలో ఇవే మందులు ధ‌ర‌ల  ప‌రంగా భారీగా  ఉంటాయి. అందుకే మేడ్ ఇన్ ఇండియా అని ఉన్న  మందు అమెరికాలో కొంటే దాని ధ‌ర అమెరిక‌న్ స‌ప్లై చైన్, ఇన్ స్యూరెన్స్ స్ట్ర‌క్చ‌ర్, ఫార్మ‌సీ  ప్రైసింగ్, ఇత‌ర రూల్స్ కార‌ణంగా అనేక రెట్లు పెర‌గ‌వ‌చ్చు.

ఇంత‌కీ మంచి జీవితం అంటే ఏమిటి? విదేశాలకు వెళ్లి బట్టలు, గిన్నెలు, ఇల్లు, పిల్లల సంరక్షణ, వైద్య అపాయింట్‌మెంట్‌లన్నీ మనమే చూసుకోవాల్సి వచ్చినప్పుడు… భారతదేశంలో మనం  సాధారణంగా అనుభవిస్తున్న జీవితం అసలు సాధారణం కానేకాదని చాలా మందికి మొదటిసారి అర్థమవుతుంది.

అమెరికాలో శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న ఒక సీనియర్ సిటిజన్‌కు, భారతదేశంలో రూ.2,500 విలువ చేసే  మేడ్ ఇన్ ఇండియా..  ఔషధం అక్కడ రూ.42వేల‌కు, పైగా 12 రోజుల ఆలస్యంతో అందడం.. ఇది ఒక్క వ్యక్తిగత అనుభవం మాత్రమే కాదు.. రెండు భిన్న ఆరోగ్య వ్యవస్థల మధ్య ఉన్న నిర్మాణాత్మక వ్యత్యాసాలకు ప్రతీక. ఇక్క‌డ గుర్తించాల్సిన  అంశం ఏంటంటే అభివృద్ధి చెందిన దేశం అంటే, తప్పనిసరిగా  మంచి జీవితం  కాదు..  సులభంగా, గౌరవంగా బ‌తకగలిగే వ్యవస్థ ఉన్న చోటే నిజమైన విలాసం ల‌భించిన‌ట్టు భావించాల్సి  ఉంటుంది.

స్వాతంత్రం త‌ర్వాత‌ భారతదేశంలో నగరీకరణ, మధ్యతరగతి విస్తరణ, అనధికారిక రంగం పెరుగుదల కలిసి.. ఒక ప్రత్యేక  సేవా ఆధారిత  జీవనశైలిని నిర్మించాయి. గృహ సహాయకులు, డ్రైవర్లు, ప్రెస్‌వాలాలు, చిన్న చిన్న పనుల కోసం అందుబాటులో ఉండే మనుషుల నెట్‌వర్క్ – ఇవన్నీ పాశ్చాత్య దేశాల్లో లగ్జరీగా పరిగణించబడే సేవలు, భారతదేశంలో మధ్యతరగతి జీవితంలో స‌ర్వ‌సాధార‌ణం అయ్యాయి.

ఒక స్పెషలిస్ట్ డాక్టర్‌ని కలవాలా? నేరుగా హాస్పిటల్‌కి వెళ్లొచ్చు. బ్లడ్ టెస్ట్ చేయించాలా? ఉదయం 6 గంటలకే ల్యాబ్ టెక్నీషియన్ ఇంటికి వచ్చి శాంపిల్ తీసుకుంటారు, మధ్యాహ్నానికల్లా రిపోర్ట్ వాట్సాప్‌లోకి వచ్చేస్తుంది. అక్కడ ఉన్నట్టు 3 నెలల వెయిటింగ్ లిస్ట్‌లు,  ఇన్సూరెన్స్ అప్రూవల్ నరకాలు మనకు ఇక్క‌డ‌ లేవు. ఇల్లు తుడవడానికి, వంట చేయడానికి, డ్రైవింగ్‌కి మనుషులు ఉండటం ఇక్కడ కేవలం ధనవంతులకే పరిమితం కాదు... మధ్యతరగతి జీవితాలకి ఇది వెన్నుముక. ఇది మన జీవితాల్లో అత్యంత విలువైనది... అంటే..  సమయాన్ని మిగులుస్తుంది.

ప్రపంచ దేశాలు బేసిక్ ఇంటర్నెట్ కోసం నెలకి రూ. 4వేల‌ కంటే ఎక్కువ ఖర్చు చేస్తుంటే, మన దేశంలో కేవలం రూ.300లకే హై-స్పీడ్ 5G డేటాను ఎంజాయ్ చేస్తున్నాం. ప్రపంచంలోనే అత్యంత చ‌వ‌కైన డేటా మనదే. ఇదే మన ఆర్థిక వ్యవస్థను డిజిటల్‌గా మార్చేసింది. రోడ్డు పక్కన తాగే రూ.5 రూపాయల చాయ్ నుంచి రూ.50వేల‌ ల్యాప్‌టాప్ వరకు... అంతా ఒకే ఒక స్కాన్! వ్యాలెట్‌లతో పనిలేదు,  కార్డ్ మెషిన్ పనిచేయడం లేదు అనే సాకులు లేవు, ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజులు లేవు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు మనకంటే చాలా వెనుకబడి ఉన్నాయి.

ఇక‌ ఆరోగ్య రంగం.. పబ్లిక్ ప్ల‌స్ ప్రైవేట్ హైబ్రిడ్ విష‌యానికి  వ‌స్తే.. భారతదేశంలో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లు, చిన్న క్లినిక్‌లు,  ఫ్యామిలీ డాక్టర్లు.. ఇవన్నీ కలిపి ఒక హైబ్రిడ్ ఆరోగ్య వ్యవస్థను నిర్మించాయి. నేరుగా స్పెషలిస్ట్‌ను కలవడం, తక్కువ ఫీజుతో కన్సల్టేషన్, చీపెస్ట్ జనరిక్ మెడిసిన్ – ఇవి  భారతదేశంలో సాధారణ అనుభవాలుగా మారాయి.
 
అమెరికా, యూరప్‌లలో డూ ఇట్ యువ‌ర్ సెల్ఫ్ అంటే డీవైఎఫ్  సంస్కృతి..  గడ్డి కత్తిరించడం నుంచి ప్లంబింగ్ వరకు..  వ్యక్తిగత బాధ్యతగా, ఖరీదైన సేవల ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చెందింది. సేవలు ఖరీదైనవి, కార్మిక వ్యయం అధికం, లీగల్ రిస్క్‌లు ఎక్కువ. ఇవన్నీ కలిసి  సేవా ఆధారిత జీవనశైలిని అక్కడ సాధారణ ప్రజలకు దాదాపు అసాధ్యంగా చేశాయి.

శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న భార్యకు, భారతదేశంలో నేరుగా పల్మనాలజిస్ట్‌ను కలవడం, తగిన మందులు తక్కువ ధరకు పొందడం, నిరంతర ఫాలో-అప్ – ఇవన్నీ పెద్దగా వ్యవస్థాపక అడ్డంకులు లేకుండా జరిగిపోతుంటాయి.

అదే అమెరికాలో అయితే .. మొదట జనరల్ ఫిజీషియన్ ద్వారా మాత్రమే స్పెషలిస్ట్‌కి రిఫరల్ చేయాల్సి ఉంటుంది. ఇక వీడియో కన్సల్టేషన్ కోసం వారం రోజుల వెయిటింగ్, 10 నిమిషాల టెలి-కన్సల్టేషన్ ద్వారా మందుల ప్రిస్క్రిప్షన్, ఫార్మసీలో స్టాక్ లేకపోవడం, 4 నుంచి ఐదు రోజుల ఆలస్యం..  చివరికి 12వ రోజున మందులు అందుబాటు.. ఈ కాలక్రమం, అమెరికా ఆరోగ్య వ్యవస్థలో  అందుబాటు అన‌డం కంటే  నిర్మాణాత్మక నియంత్రణకి ప్రాధాన్యం ఉన్నదని చూపిస్తుంది. 

ఇక‌ బిల్లింగ్ షాక్ సంగ‌తి స‌రే  స‌రి. భారతదేశంలో అదే మందులు సుమారు రెండు వేల ఐదువందల రూపాయలకు లభ్యమౌతుంటే..   అమెరికాలో ఇన్సూరెన్స్ 50శాతం రాయితీ తర్వాత కూడా 21 వేల రూపాయలకు పైనే ఖర్చవుతుంది.   అంటే అసలు ధర  . 42 వేల రూపాయలన్న మాట‌. 

కన్సల్టేషన్ ఫీజు 283 డాల‌ర్లు అంటే రూ. 23వేలు ఇందుకు అద‌నం. ఇది వ్యక్తిగత అనుభవం అయినప్పటికీ, అమెరికా ఔషధ ధరల సాధారణ ధోరణితో పూర్తిగా సరిపోతుంది. అక్కడ సాధారణ క్రానిక్ మందులు కూడా భారతదేశంతో పోలిస్తే నాలుగు నుంచి ఇర‌వై రెట్ల‌ వరకు అధిక ధరలతో ఉంటున్నాయి. 
అమెరికాలో మెడిసిన్ తీసుకోవడం అంటే, అదే మేడ్ ఇన్ ఇండియా ఔషధాన్ని, పది రెట్లు ధరకు తిరిగి కొనడంతో స‌మానం. 

భారతదేశంలో నేష‌న‌ల్ ఫార్మాస్యుటిక‌ల్  ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) ద్వారా అనేక అవసరమైన ఔషధాలకు ధరల పరిమితులు విధించబడుతున్నాయి. జనరిక్ మందుల ఆధిపత్యం, దేశీయ తయారీ వల్ల తక్కువ ఖర్చు, కాస్ట్-ప్లస్ మోడల్ ద్వారా ధరల నియంత్రణ జ‌రుగుతుంది. అదే అమెరికాలో.. పేటెంట్ హక్కులు, బ్రాండెడ్ స్పెషాలిటీ డ్రగ్స్, ఫార్మ‌సీ బెనిఫిట్ మేనేజ‌ర్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, హాస్పిటల్ మార్కప్‌లు.. ఇవన్నీ కలిసి ఔషధ ధరలను గణనీయంగా పెంచుతున్నాయి.

2020–2025 మధ్య అమెరికాలో ప్రిస్క్రిప్షన్ ఔషధాల రిటైల్ మార్కెట్ సగటు  75శాతం  నుంచి 120 శాతం వరకు ఉండగా, భారతదేశంలో అది 32 నుంచి 45శాతం మధ్యలోనే ఉంది.  యూఎస్ లో ఇన్సూరెన్స్ వ్య‌వ‌హారం.. రక్షణ అందించేదా?  లేక‌ బంధనాలు విధించేదా? అన్నది అర్ధం కాదు. అస‌లు అమెరికా ఆరోగ్య వ్యవస్థలో ఇన్సూరెన్స్ పాత్ర ఏంటి? అని ప‌రిశీలిస్తే.. బేసిగ్గా బీమా అనేది ఒక అందుబాటు కోసం అవసరం.  కానీ అదే సమయంలో బిల్లింగ్ సంక్లిష్టత, నెట్‌వర్క్ పరిమితులు, ప్రీ-అప్రూవల్ నిబంధనలు ద్వారా రోగికి అదనపు ఒత్తిడిగా మారిన  స్థితిగ‌తి.   అదే ఇండియాలో  ఇన్సూరెన్స్ కవరేజ్ తక్కువైనా, నేరుగా మ‌నం చెల్లించే ఖర్చు చాలా సందర్భాల్లో అమెరికాతో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉంటుంది. 

అభివృద్ధి  చెందిన దేశం- చెందుతున్న  ఉన్న దేశం అనే  ఒక కోణంలోంచి చూస్తే.. అమెరికాలాంటి డెవ‌ల‌ప్డ్ కంట్రీ అంటే  మెరుగైన  ఆరోగ్య స‌దుపాయాలు, మరింత  మెరుగైన  జీవ‌న  ప్ర‌మాణాలు.. అని భావిస్తారు. కానీ కాస్ట్, టైమ్, యాక్సెస్, సామాజిక బంధాలు వంటి పరిమితులను కలిపి చూసినప్పుడు, భారతదేశంలోని మధ్యతరగతి జీవితం అనేక కోణాల్లో  విలాసవంతమైనదిగా కనిపిస్తుంది.

డేటా ప్రజాస్వామ్యం..ప్రపంచంలోనే చౌకైన ఇంటర్నెట్ భారతదేశంలో.. నెలకు సుమారు రూ.300–రూ.400లో హై-స్పీడ్ 4G/5G డేటా ప్రపంచంలోనే అత్యంత చౌకైన మొబైల్ డేటా రేట్లు క‌లిగి ఉంటాయి. ఇది యూపీఐ, డిజిటల్ పేమెంట్స్, ఆన్‌లైన్ సేవలు, పది నిమిషాల డెలివరీ వంటి విప్లవాలకు పునాది వేసింది.  ఇక‌ యూపీఐ  విప్లవం.. ప్రపంచానికి ఒక పాఠంగా మారింది. ,  ఐదు రూపాయల చాయ్ నుంచి  50వేల‌ రూపాయల ల్యాప్‌టాప్ వరకు.. సింగిల్ స్కాన్, ట్రాన్సాక్షన్ ఫీజు లేకుండా, రియల్ టైమ్ సెటిల్‌మెంట్.. ఇది పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికీ సాధారణం కాని సౌకర్యం. కార్డ్ మెషిన్, చార్జ్‌బ్యాక్, ఫీజులు, కార్డ్ వర్క్ చేయడం లేదు... అనే సమస్యలు – ఇవన్నీ ఇండియన్ యూపీఐ వ్యవస్థలో దాదాపు లేవు.
 
 హ్యూమన్ సపోర్ట్ సిస్టమ్, బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, వంటి  ప్లాట్ ఫామ్ లు చిన్న‌పాటి అల్లం ముక్క‌, పాలు, ఇంకా  ఎన్నెన్నో వంట  సామ‌గ్రి.. ప‌ది ఇర‌వై నిమిషాల్లో ఇంటి ద‌గ్గ‌ర  డెలివ‌రీ ఇచ్చేస్తున్నాయ్. ఇది కేవలం టెక్నాలజీ కాదు.. అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, తక్కువ డెలివరీ ఖర్చు, సేవా రంగంలో విస్తృత ఉపాధి.. ఇవి కలిసి భారతీయ నగర జీవనశైలిని ప్రపంచంలో అరుదైన స్థాయిలో సౌకర్యవంతం చేశాయి. ఫారిన్ కంట్రీస్ లో డూ ఇట్ యువ‌ర్ సెల్ఫ్ మెథ‌డ్ ఫాలో అవుతుంటే అదే భార‌త్ లో స‌ర్వీస్ బేస్డ్ కంఫ‌ర్ట్ అద్భుతంగా  కొన‌సాగుతోంది.

సామాజిక బంధాలు, లీగల్ కల్చర్, రోజువారీ రాజభోగం,  సామాజిక సేఫ్టీ నెట్.. బంధాల సంస్కృతి వంటి విష‌యాల‌కు వ‌స్తే.. భారతదేశంలో.. పక్కింటివాళ్లు, బంధువులు, ఫ్యామిలీ డాక్టర్, గృహ సహాయకులు – ఇవన్నీ కలిసి ఒక అనధికారిక సోష‌ల్ సేఫ్టీ ఇస్తున్నాయి. సమస్య వచ్చినప్పుడు  కోర్టు నోటీసు కాదు..  కిచిడీ పంపే సంస్కృతి ఇక్క‌డ బ‌లంగా  విస్త‌రించి  ఉంది.

అదే పాశ్చాత్య దేశాల్లో.. లీగల్ నోటీసులు, లయబిలిటీ, ఇన్సూరెన్స్ క్లాజులు.. ఇవన్నీ వ్యక్తిగత సంబంధాలపై కూడా ప్రభావం చూపుతాయి.  ఉచితమైన‌ చిన్న చిన్న ఆనందాలు వంటి విష‌యానికి వ‌స్తే.. హోటల్‌లో ఉచిత నీళ్లు, వీధి చివర ప్రెస్‌వాలా.. తక్కువ ధరలో ఇస్త్రీ, చిన్న రిపేర్‌లు
ఇవి అన్నీ కలిసి, భారతీయ మధ్యతరగతి జీవితాన్ని వీఐపీ లైఫ్ స్టైల్  గా మార్చే రోజువారీ రాజభోగం.

భారతదేశంలో.. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాల కొరత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓవ‌ర్ క్రౌడింగ్,, మౌలిక వసతుల లోపం.. అనధికారిక వైద్యులు, క్వాక్‌లు – ఇవన్నీ కూడా ఒక పెద్ద సమస్యే కానీ అదేమంత ఇబ్బందిక‌రం  కాదు. ద‌గ్గ‌ర్లో ఉన్న  టౌన్ లేదా  సిటీకి  వ‌స్తే అన్నీ  అవే స‌ర్దుకుంటాయి. 

నగరాల్లో హై-క్వాలిటీ ప్రైవేట్ హాస్పిటల్స్.. కానీ అదే సమయంలో, కొన్ని చోట్ల అధిక బిల్లింగ్, అనవసర టెస్టులు, కమర్షియలైజేషన్ అంటే, భారతదేశం  సర్వత్రా ఉత్తమం కాదు అనే అభిప్రాయాన్నిస్తుంది.  కానీ, కాస్ట్ ప్ల‌స్,  యాక్సెస్ ప్ల‌స్,  సామాజిక బంధాలు కలిపి చూసినప్పుడు, మధ్యతరగతి భారతీయుడి జీవితం అనేక పాశ్చాత్య దేశాల మధ్యతరగతి జీవితంతో పోలిస్తే, గణనీయంగా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఇక‌ పాశ్చాత్య దేశాల బలాలు ఎలాంటివో చూస్తే.. అధునాతన రీసెర్చ్, స్పెషలైజ్డ్ ట్రీట్‌మెంట్, క‌టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ.. కొన్ని క్రిటికల్ కేర్, రేర్ డిసీజ్ ట్రీట్‌మెంట్‌లలో అమెరికా, యూరప్ ముందంజలో ఉన్నాయి. అంటే, ఇన్నోవేషన్ వ‌ర్సెస్ యాక్సెస్ – రెండు వ్యవస్థలు రెండు భిన్న లక్ష్యాలను ఆప్టిమైజ్ చేస్తున్నాయి. ఇక ప్రపంచం కుళ్ళుకునేలాంటి నిజం ఏంటో చూస్తే.. భారతదేశం అనేది కేవలం ఒక దేశం కాదు.  అడుగడుగునా సౌకర్యాలు నిండిన ఒక అద్భుతమైన ప్రపంచం. పాశ్చాత్య దేశాలలో ప్రజలు తమ పనులన్నీ.. ఉదాహ‌ర‌ణ‌కు గడ్డి కత్తిరించడం నుంచి ప్లంబింగ్ వరకు.. తామే చేసుకుంటూ..  అంటే నీ ప‌నులు నువ్వే చేసుకో! అనే క‌ల్చ‌ర్ ద్వారా సగం జీవితాన్ని గడిపేస్తుంటే... ఇండియాలో మాత్రం మనల్ని కనిపెట్టుకుని చూసే ఒక సేవా ఆధారిత జీవనశైలి కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.

చ‌వ‌కైన మందులు, న‌గ‌రాల్లో త‌క్ష‌ణ  వైద్య స‌దుపాయాలు, చీపెస్ట్ డేటా, యూపీఐ ద్వారా డిజిట‌ల్ విప్ల‌వం, ప‌ది నిమిషాల్లోనే ఏ వ‌స్తువైనా  డెలివ‌రీ, ఇంకా.. హెల్ప‌ర్స్, డ్రైవ‌ర్లు, ఒక‌రి మ‌ధ్య మ‌రొక‌రికి అనుబంధాల  సంస్కృతీ సంప్ర‌దాయాలు, సామాజికంగా  ఒక  మంచి నెట్ వ‌ర్క్ క‌లిగి  ఉండ‌టం.. 
ఇవి అన్నీ కలిపి, ఒక సేవా ఆధారిత, మానవ సంబంధాలపై నిలిచిన, డిజిటల్‌గా శక్తివంతమైన జీవనశైలిని నిర్మించాయి. పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి చిన్న చిన్న‌ కంఫర్ట్ ల‌ కోసం కూడా భారీగా ఖర్చు చేయాల్సి వ‌స్తోంది. ఇక‌ డీఐవై  స్ట్ర‌గుల్ సంగ‌తి స‌రే స‌రి.. వీటికి  లీగల్ ఒత్తిడి అద‌నం.  ఇవన్నీ మధ్యతరగతి జీవితాన్ని కఠినంగా మార్చుతున్నాయి. మొత్తంగా  బాటమ్ లైన్ ఏంటంటే.. తూర్పుకైనా వెళ్ళు, పడమరకైనా వెళ్ళు… సాధారణ భారతీయ మధ్యతరగతి జీవిత‌మే.. నిజమైన విలాసవంతమైన జీవితం.

 -సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

google-ad-img
    Related Sigment News
    • Loading...