జంపింగ్ సీన్ రివర్స్ అవుతోంది
posted on May 9, 2015 9:23PM

రాజకీయాలలో ఒక్కోసారి ఒక్కోరకం సీజను నడుస్తూ వుంటుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే మొన్నటి వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఎంతో ఉత్సాహం చూపించేవారు. టీఆర్ఎస్ ప్రయోగిస్తున్న ‘ఆకర్ష’ పథకం పుణ్యమా అని తెలంగాణలో ఇప్పటికే అనేకమంది టీడీపీ కార్యకర్తలు, నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక కాంగ్రెస్ నాయకుల సంగతి సరేసరి. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులతో కిటకిటలాడిపోతోంది. ఎంతమంది ఎక్కినా ఒక్కరికి స్థానం వుండే మాయా తివాచీ తరహాలో టీఆర్ఎస్ అనునిత్యం ‘ఆకర్ష’ పథకాన్ని అమలు చేస్తోంది. ఎవరు టీఆర్ఎస్‌లోకి జంప్ చేసినా, అందరి నోట ఒకటే మాట.. టీఆర్ఎస్ అద్భుత పరిపాలన చూసి పార్టీ మారాను. నా నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్టీ మారాను. ఇక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ మినహా మిగిలిన పార్టీలు బతికి బట్టకట్టడం కష్టమేమో అనే అనుమానాలు ఇప్పుడిప్పుడే కలుగుతున్న తరుణంలో లేటెస్ట్‌గా సీన్ రివర్స్ అయింది. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తమ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరారు. అది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు సొంత జిల్లా అయిన మెదక్ జిల్లా నుంచి. మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు శనివారం నాడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. టీఆర్ఎస్ నియంతృత్వ పాలనను భరించలేకే టీడీపీలో చేరామని వారు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ నుంచి కొంతమంది టీడీపీలో చేరడం అనేది వింతల్లోకెల్లా వింత అనే చెప్పాలి. అలాగే ఈ చేరికలను మారుతున్న పరిస్థితులకు సంకేతంగా భావించవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్ పరిపాలన మీద ప్రతిపక్షాలతోపాటు అనేక వర్గాలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలో జరిగిన ఈ చిన్న ఘటన భవిష్యత్తులో భారీ పరిణామాలకు నాందిగా భావించవచ్చని కూడా వారు అంటున్నారు.