లోక్ సభలో అల్లరి చేస్తే హైకోర్టు విభజన జరుగుతుందా?
posted on May 5, 2015 5:37PM
.jpg)
ఉమ్మడి హైకోర్టును విభజనకు కేంద్రమే చొరవ చూపి తక్షణమే విభజించాలని లోక్ సభలో తెరాస యంపీలు ఈరోజు గట్టిగా వాదించారు. నినాదాలతో సభను హోరెత్తించారు. అంతకు ముందు పార్లమెంటులో గాంధీ విగ్రహం వద్ద బైటాయించి నిరసన ప్రదర్శన కూడా చేసారు. అయితే వారందరికీ కూడా కేంద్రం కూడా హైకోర్టు విభజనకు సుముఖంగానే ఉందని కానీ హైకోర్టులో దాఖలయిన ఒక పిటిషన్ కారణంగానే ఆలస్యం అవుతోందని తెలుసు. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ కూడా వారికి అదే విషయం చెప్పి హైకోర్టు విభజనకు మరికొంత సమయం పడుతుందని చెప్పినప్పటికీ వారు తమ ఆందోళనను విరమించలేదు.
ఇంతకు ముందు హైకోర్టు విభజనపై దాఖలయిన ఒక పిటిషనుపై విచారణ జరుగుతున్నప్పుడు ఒకవేళ ఉమ్మడి హైకోర్టుని విభజించి తెలంగాణా రాష్ట్ర హైకోర్టుని వేరేచోటికి తరలించాలంటే విభజన చట్టాన్ని సవరించవలసి ఉంటుందని హైకోర్టు ధర్మాసనం కుండబ్రద్దలు కొట్టినట్లు తేల్చి చెప్పింది. కొద్ది రోజుల క్రితమే ఆ పిటిషనుపై హైకోర్టు ధర్మాసనం తన తుది తీర్పు వెలువరించింది. అందులో రాష్ట్ర విభజన చట్ట ప్రకారం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే హైకోర్టు ఏర్పాటు చేయవలసి ఉంటుంది తప్ప తెలంగాణా రాష్ట్రానికి కాదణి విస్పష్టంగా పేర్కొనబడి ఉంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతున్నప్పటికీ అది తెలంగాణకే చెందుతుంది. కనుక హైదరాబాద్ లో వేరేచోట తెలంగాణా హైకోర్టుని తరలించడం లేదా తెలంగాణా గడ్డ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేయడం రెండూ కూడా విభజన చట్ట ప్రకారం వీలుపడదు. కనుక ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు భవనాలు నిర్మించుకొని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్కడికి తరలించేవరకు కూడా ఉమ్మడి హైకోర్టు కొనసాగవలసిందేనని,” స్పష్టంగా పేర్కొంది.
కనుక ఒకవేళ తెరాస యంపీలకు నిజంగా హైకోర్టు విభజన జరగాలని కోరుకొంటున్నట్లయితే వారు ముందుగా విభజన చట్ట సవరణకు పట్టుబట్టాలి. కానీ వారు ఆపని చేయకుండా సభలో రాద్ధాంతం చేస్తున్నారు.మరి కొద్ది రోజులలో పార్లమెంటు సమావేశాలు ముగిసిపోతాయి. కనుక ఈలోగానే వారు చట్ట సవరణకు కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఏమయినా ప్రయోజనం ఉంటుంది.