పరాకాష్టకు చేరిన టీఆర్ఎస్ వేర్పాటువాదం!

 

తెలంగాణ రాష్ట్ర సమితి వేర్పాటువాద ధోరణి పరాకాష్టకు చేరుకుంది. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్‌లో వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంలాఏర్పడేలా చేసిన టీఆర్ఎస్ నాయకులు తమ వేర్పాటు ఉద్యమ పరమావధి అయిన అధికారాన్ని సొంతం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి అధికారాన్ని చేపట్టినప్పటికీ ఇతర ప్రాంతాలను, సాటి భారతీయులను ద్వేషించే తమ ధోరణిని టీఆర్ఎస్ నాయకులు మానుకోకుండా కొనసాగిస్తున్నారు.

 

ఇప్పటి వరకూ రాష్ట్ర స్థాయిలో వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తూ వచ్చిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు జాతీయ స్థాయి వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలే దీనికి తార్కాణంగా నిలుస్తున్నాయి. భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్ విషయంలో కల్వకుంట కవిత చేసిన విషపూరిత, వేర్పాటువాదాన్ని ప్రేరేపించే వ్యాఖ్యలు ప్రతి ఒక్క భారతీయుడికీ మనస్తాపాన్ని కలిగించేవే!

 

ఏ భారతీయుడి నోటిలోంచి రాని మాటలు కవిత మాట్లాడారు. అవి.. స్వాతంత్ర్యానికి పూర్వం ప్రత్యేక దేశాలైన కాశ్మీర్, హైదరాబాద్‌లనుభారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బలవంతంగా భారతదేశంలో కలిపారట. జమ్ము కాశ్మీర్ విషయంలో భారతదేశానికి స్పష్టత రావాలట. అవసరమైతే భారతదేశం తన అంతర్జాతీయ సరిహద్దుల్ని మార్చుకోవాలట. కాశ్మీర్‌ను భారతదేశం వదులుకోవాలన్నట్టుగా వున్న కవిత ఘోరమైన మాటలు దేశ వ్యాప్తంగా ఆందోళనని కలిగించాయి. దేశంలోని ప్రతి ఒక్కరూ కవిత వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.

 

బాధ్యతగల పార్లమెంట్ సభ్యురాలి హోదాలో వున్న కవిత మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? వేర్పాటువాదంతో అధికారంలోకి వచ్చామనే అహం బాగా పెరిగిపోయి మాట్లాడిన మాటలుగానే ఇవి వున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌ సంస్థానాన్ని ఆనాడు సర్దార్ పటేల్ భారతదేశంలో కలపడం వల్లనే తెలంగాణలో తరతరాల బానిసత్వం తొలగిపోయిందని, ఇప్పుడు టీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి రావడానికి కూడా అదే కారణమని కవిత మరచిపోయారా? లేక మరచిపోయినట్టు నటిస్తున్నారా?

 

కవిత తన దూకుడుతో కూడిన మాటలను సీమాంధ్రుల మీద ప్రయోగిస్తే ఇంతకాలం భరించారు. ఇప్పుడు అదే తరహా దురహంకార వ్యాఖ్యల్ని దేశ సమగ్రత మీద చేయడం ఎంతమాత్రం క్షమార్హం కాదు. ఎంపీ హోదాలో వుండి దేశ సమగ్రతకు భంగం కలిగించేలా వ్యాఖ్యానించిన కల్వకుంట్ల కవిత పార్లమెంటు సభ్యురాలిగా వుండటానికి ఎంతమాత్ర అర్హురాలు కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కవితను తక్షణం ఎంపీ పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.

 

అయినా కవిత లాంటి నాయకులకు దేశం మరో అవకాశం ఇవ్వాలి. తాను పొరపాటు వ్యాఖ్యలు చేశానని బహిరంగంగా క్షమాపణ చెబితే ఆమెని ఈ దేశ ప్రజలు క్షమిస్తారు. కవిత ఇప్పటికైనా తన తప్పును తెలుసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అయితే ఇప్పటికి కూడా కల్వకుంట కవిత లాంటి టీఆర్ఎస్ నాయకులు తమ వేర్పాటువాద ధోరణులను విడిచిపెట్టకుండా భారతదేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తే వారిని ఈ దేశం ఎప్పటికీ క్షమించదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయం సాధించిన టీఆర్ఎస్ వేర్పాటువాద ధోరణి భారతదేశం విషయంలో ఎంతమాత్రం విజయం సాధించదు! జైహింద్!!