టీఆర్ఎస్-ఎంఐఎం దోస్తీ ముగిసినట్టేనా?
posted on Jul 23, 2015 2:45PM

కొన్ని కొన్ని స్నేహాలు ఎందుకు మొగ్గ తొడుగుతాయో... అంతలోనే ఎందుకు అకస్మాత్తుగా వాడిపోతాయో ఎంత ఆలోచించినా అర్థంకాని విషయం. ఈమధ్య మొదలై అంతలోనే ముగిసిన టీఆర్ఎస్ - ఎంఐఎం పార్టీల మధ్య స్నేహం కూడా ఈ కోవలోకే వస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరిగిన సందర్భంలో ఈ రెండు పార్టీలు కలసి పనిచేసిందే లేదు. ఇస్తే రాయల తెలంగాణ ఇవ్వండి.. లేకపోతే తెలంగాణ అసలే వద్దు అనే స్టాండ్‌కి ఎంఐఎం మొదటి నుంచీ కట్టుబడి వుంది. అయితే ఎంఐఎం అభీష్టా్నికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత టీఆర్ఎస్ - ఎంఐఎం పార్టీల మధ్య స్నేహ సుమం వికసించింది. టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఒవైసీ సోదరుల ఇంటికి వెళ్ళి స్నేహహస్తం చాచారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం మూడు పువ్వులు - ఆరు కాయల్లాగా వర్ధిల్లింది. నిన్న మొన్నటి వరకూ వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కొనసాగింది. ఈ రెండు పార్టీలు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో కలసి పోటీ చేస్తాయనే అందరూ భావించారు. కేసీఆర్ స్నేహహస్తం వెనుక జీహెచ్ఎంసీ ఎన్నికలే ప్రధాన కారణం అని కూడా అందరికీ తెలిసిన విషయమే.
అయితే రెండు పార్టీల మధ్య ఏమైందోగానీ, రంజాన్ మాస ప్రారంభంలోనే వీరిమధ్య స్నేహం కటీఫ్ అయిపోయినట్టు అర్థమవుతోంది. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలలో తమ పార్టీ ఏ ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ స్పష్టంగా ప్రకటించడంతో ఈ రెండు పార్టీల మధ్య స్నేహం ముగిసిందని అర్థమైంది. ముస్లిం ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి టీఆర్ఎస్ సొంతగా వ్యూహాలు పన్నుతూ వుండటమే వీరిమధ్య దూరం పెరగడానికి కారణమని తెలుస్తోంది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని ఒవైసీ ప్రకటిస్తే, అదేంటి భయ్యా అని టీఆర్ఎస్ నాయకులు మరోసారి స్నేహహస్తం చాచకుండా, లైట్‌గా తీసుకున్న ధోరణిలో వ్యహరించారు. ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇస్తూ, కానుకలను అందిస్తూ వారిని మంచి చేసుకునే ప్రయత్నంలో ముమ్మరమైపోయారు. ఆ విందులకు, కానుకల కార్యక్రమాలకు ఎంఐఎం నేతలను ఆహ్వానించిన దాఖలాలు కూడా కనిపించలేదు. అంటే, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ కూడా ఒంటరిగానే పోటీ చేయాలని డిసైడ్ అయిందన్నమాట. ఇలా ముగిసిన దోస్తీ పర్యవసానాలు ఎలా వుంటాయో వేచి చూడాలి.